కోట చరిత్ర కోయిలకొండ కోటను వడ్డె రాజులు నిర్మించారు. కాల క్రమంలో కోట వెలమరాజుల (పద్మనాయక రాజుల) వశమైంది. ఈ కోటను పరిపాలించిన చివరి వెలమ రాజు సవాయిబసవరాజు. అతడు గోల్కొండ కుత్‌బ్‌షాహి వంశ మూల పురుషుడు మహ్మద్ కులీకుత్‌బ్‌షాకు సమకాలికుడు. కోయిలకొండ కోట రాజు సవాయి బసవరాజు కాగా, సేనాధిపతి యాదవరావు, కోశాధికిరగా పురుషోత్తంరావు పని చేశారు. కోయిలకొండ రాజ్యం చాలా విస్తీర్ణం కలిగి ఇప్పటి చించోళి వరకు వ్యాపించి ఉండేది. యాదవరావు తన గుర్తుగా కోట కింద ప్రాంతం గల గ్రామాన్ని పేట అని పిలిపిచే వారు. ఈ పేటలోని ప్రజలకు తాగునీటి కోసమై చేదబావిని త్రవ్వించాడు. గంభీరరావు తన జ్ఞాపకార్ధకంగా గంభీరోని చెరువు తవ్వించాడు. గోల్కొండ నవాబు కోయిలకొండను ఆక్రమించాలని కోయిలకొండ రాజుపై దండెత్తారు. కోట పేటలో భీకరమైన యుద్దం జరిగి వేలాది మంది మృత్యువు పాలయ్యారు. అనంతరం హిందూ, ముస్లింల పెద్దలు అందరు ఐక్యతతో ఉండాలని కోటపై భాగంలో ఒక శిలా శాసనాన్ని రాయించారు. చూడదగ్గ ప్రదేశాలు కోటలో నిర్మించిన అద్భుత కట్టడాలైన గోడలు, సరస్సులు, ధాన్యారాగాలు, దేవాలయాలు, రెండు పెద్ద పిరంగులతో పాటు కోట చుట్టూ గల కొండలపై అలనాడే మహిమ గల దేవాలయాల నిర్మించారు. కోటకు పడమటి భాగాన రామగిరి అని నాడు రామకొండ అని నేడు పిలిచే ఎత్తైన కొండపై శ్రీ రాముని పాదములు కలదు. ఆ కొండపై సైతం లెక్కలెనన్ని గృహాలు ఉన్నాయి. పూర్వ కాలంలో మునులు, రుషులు సంవత్సరాల తరబడి తపస్సు చేశారని పూర్వీకుల కథనం. ఈ కొండపై విశేష వన మూలికలు ఉన్నాయి. అక్కడ గల సరస్సులోని నీళ్ళతో స్నానం చేసి ఆ నీరును తాగి రాముని పాదాన్ని దర్శించుకుంటే కోరిన కోర్కెలు అన్ని ఇట్టే నెరవేరుతాయని భక్తుల ప్రగాడ విశ్వాసం. కోటకు దక్షిణాన పెద్దవాగు కలదు. దాన్ని పక్కనే ధర్మరాజుల బండ కలదు. ఇక్కడికి పంచపాండవులు సైతం తమ అరణ్యవాసంలో వచ్చినట్లు పూర్వీకులు అంటారు. కోటకు తూర్పుభాగాన ఎత్తైన కొండపై వీరభద్రస్వామి ఆలయాన్ని నిర్మించారు. ఇక్కడికి మనహారాష్ట్రంతో పాటు ఇతర రాష్ట్రాల వారు సంవత్సరం పొడవున వచ్చి స్వామి వారిని దర్శించుకుంటుంటారు. మొహర్రం విశిష్టత కోయిలకొండలో ప్రతి సంవత్సరం మొహర్రం పండగకు ఎంతో విశిష్టత ఉంది. దిశ నలుమూలల నుంచి వేల సంఖ్యలో ప్రజలు వచ్చి కోటపై గల బీబీ ఫాతిమాను దర్శించుకుంటారు. కాగా ఈ మొహర్రం పండగను ఇక్కడ మతసామరస్యంతో హిందూ, ముస్లింలు ఐక్యతతో జరుపుకోవడం ప్రత్యేకత. హిందూ, మహ్మదీయుల సంప్రదాయాలను ఏకం చేసి ఈ ఉత్సవాలను ఇక్కడ ఘనంగా నిర్వహిస్తారు.
= = = = =
|

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి