పాలమూరు జిల్లాకు చెందిన సమరయోధులలో ప్రముఖుడైన మందుముల నరసింగరావు మార్చి 17, 1896న ప్రస్తుత రంగారెడ్డి జిల్లా చేవెళ్ళలో జన్మించారు. స్వగ్రామమైన తలకొండపల్లిలో ప్రాథమిక విద్య పూర్తిచేసి 1912లో హైదరాబాదు వచ్చి ఉన్నత విద్యనభ్యసించారు. న్యాయశాస్త్రంలో పట్టభద్రులయ్యారు. పర్షియన్ భాషలో కూడా ఇతను గొప్ప పండితుడు మరియు ప్రముఖ పత్రికా రచయితగా పేరుపొందారు. 1916లో తన తోటివారితో కలిసి వామన్ నాయక్ అధ్యక్షతన ‘యంగ్‌మెన్ యూనియన్’ను స్థాపించారు. 1921లో ఆంధ్రజనసంఘాన్ని స్థాపించిన వారిలో ఒకరు. 1927లో న్యాయవాదవృత్తికి స్వస్తి చెప్పి పత్రికారచన, రాజకీయాలు చేపట్టారు. రయ్యత్ అనే ఉర్దూ వార్తాపత్రికకు వ్యవస్థాపక సంపాదక బాధ్యతలు చేపట్టారు. రయ్యత్ ద్వారా నిజాం నిరంకుశాన్ని ఎండగడుతూ ప్రజలను చైతన్య పర్చారు. 1927లో ప్రారంభించబడిన రయ్యత్ వార్తాపత్రిక నిజాం ప్రభుత్వంపై విమర్శలు చేసినందుకు నిషేధానికి గురై 1931లో దినపత్రికగా పునఃప్రారంభమైంది. మందుముల సమరరంగంలో కూడా కీలకపాత్ర వహించి 1937లో ఇందూరు (నిజామాబాదు)లో జరిగిన 6వ ఆంధ్రమహాసభకు అధ్యక్షత వహించారు. 1938-42 కాలంలో నిజాం లెజిస్లేటివ్ కౌన్సిల్ సభ్యులుగా ఉన్నారు. 1942లో హైదరాబాదు జర్నలిస్టుల సంఘం అధ్యక్షులుగా ఎన్నికయ్యారు. 1947లో జాయిన్ ఇండియా ఉద్యమంలో పాల్గొని అరెస్టు అయ్యారు. ఇవేకాక బాల్యవివాహాల రద్దుకు, వితంతు వివాహాలకు బాగా కృషిచేశారు. 1952లో కల్వకుర్తి నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున హైదరాబాదు శాసనసభకు ఎన్నికయ్యారు. భూసంస్కరణల అమలుకై ఏర్పాటైన భూకమీషన్‌లో అధ్యక్షునిగా నియమితులైనారు. 1957-62 కాలంలో రాష్ట్ర మంత్రివర్గంలో పనిచేశారు. నిజాం కాలంలోని దుష్పరిపాలనను వర్ణిస్తూ "50 సంవత్సరాల హైదరాబాదు" గ్రంథాన్ని స్వీయజీవిత చరిత్రగా రచించారు. మార్చి 12, 1976న మందుముల మరణించారు. బంధుత్వాలు: మందుముల నరసింగరావు కూతురు అనంతలక్ష్మిని బూర్గుల రామకృష్ణారావు రెండో వివాహం చేసుకున్నారు. సమరయోధుడిగా పేరుపొందిన మందుముల రామచంద్రారావు ఈయన సోదరుడు. ఇవి కూడా చూడండి:
| |||||||||||

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి