22, ఏప్రిల్ 2013, సోమవారం

చింతరేవుల ఆంజనేయస్వామి ఆలయం (Chintarevula Anjaneya Swamy Temple)

చింతరేవుల ఆంజనేయస్వామి ఆలయం
పాలమూరు జిల్లా ధరూర్ మండలం చింతరేవులలో వెలిసిన పురాతన ఆలయమే చింతరేవుల ఆంజనేయస్వామిగా పిలువబడుతున్నది. సుమారు 750 సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ ఆలయానికి ఒక ప్రత్యేకత ఉంది. గద్వాల సంస్థానాధీశులచే పరాభవం పొందిన శేషుదాసు అవమానభరితుడై నడక సాగిస్తూ అలసిపోయి ఈ ప్రాంతానికి వచ్చిన పిదప ఒక పుట్ట చూసి అందులో చేయివేసి పాముకాటుకు గురై మరణించదలిచాడు. మరో తొర్రలోంచి పాము వెళ్ళిపోయింది కాని కాటు పడలేదు.

శేషుదాసు
అక్కడే చింతచెట్టు కింద విశ్రాంతి తీసుకొనుచుండగా ఆంజనేయుడు కలలో కనిపించి నీవు ఆత్మహత్య చేసుకొనే అవసరం లేదు, నీ వల్ల ప్రజలకు మేలు జరుగునున్నది, ఈ పుట్టలో నేను దాగిఉన్నాను, నన్ను వెలికితీసి ఆలయం నిర్మించమని కోరగా, శేషుదాసు స్వామివారి ఆదేశం మేరకు పుట్టలోంచి ఆంజనేయస్వామి విగ్రహాన్ని తీసి ఆలయం నిర్మించి రోజూ పూజలు చేస్తుండేవాడు. చింతరేవుల గ్రామానికి చెందిన ఒకవ్యక్తి ఇతనికి ఆహారం అందజేసేవాడు. ఆ తర్వాత స్వామి మరోమారు కలలో కనిపించి నీవు మల్డకల్ వెంకటేశ్వరస్వామి వద్దకు వెళ్ళినచో మంచికలుగును అని పలుకగా స్వామి ఆదేశం మేరకు శేషుదాసు అక్కడికి వెళ్ళి మహిమలు చూపిస్తూ భక్తులకు ఆకట్టుకున్నాడు. శేషజీవితం అక్కడే గడిపాడు. ఈ ఆంజనేయస్వామి ఆలయం పరిసరాలలో చింతచెట్లు అధికంగా ఉండుట వల్ల చింతరేవుల పేరు వచ్చినట్లు కథనం. ఇక్కడి మరో విశిష్టత ఏమిటంటే ఆలయ పరిసరాలలొ అర్చకులు తప్ప ఎవరూ ఉండకపోవడం. 

విభాగాలు: పాలమూరు జిల్లా దెవాలయాలు, ధరూరు మండలము,    

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి