పాలమూరు తిరుపతిగా విరాజిల్లుతోన్న మన్యంకొండ శ్రీవేంకటేశ్వరాలయం దేవరకద్ర మండలం కోటకదిర గ్రామసమీపంలో ఎత్తయిన కొండపై ఉంది. మహబూబ్‌నగర్ నుంచి రాయచూరు వెళ్ళు రహదారికి దేవరకద్ర రావడానికి 5 కిమీ ముందుగా ఎడమవైపున కనిపించే పెద్ద గుట్టపై పూజలందుకుంటున్న వేంకటేశ ఆలయం జిల్లాలోని ప్రముఖ ఆలయాలలో ఒకటి. పూర్వం ఇక్కడ మునులు చేసిన ప్రాంతంగా ప్రసిద్ధి చెందింది. మునులకొండయే క్రమేణా మన్యంకొండగా మారినట్లు ప్రతీతి. ప్రతిఏటా మాఘశిద్ధ దశమిదినాన ఇక్కడ బ్రహ్మోత్సవాలు వైభవంగా నిర్వహిస్తారు.మన్యంకొండ దిగువన శ్రీ అలివేలు మంగతాయారు దేవస్థానం ఉంది. ఏటా మన్యంకొండ శ్రీలక్ష్మీ వెంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు జరిగిన నెల రోజులకు అలివేలు మంగ ఉత్సవాలు నిర్వహిస్తారు.
ఆలయ చరిత్ర:
మునుల కోరిక మేరకు శ్రీమహావిష్ణువు మన్యంకొండలో వెలిసినట్లు పురాణగాథ వివరిస్తోంది. లక్ష్మీదేవిని వెదికుతూ శ్రీమహావిష్ణువు భూలోకానికి వచ్చినప్పుడు వాసుకి అనే సర్పం కోరికపై మన్యంకొండకు వచ్చి ఆతిథ్యం స్వీకరించినట్లు, ఆయన కోరిక మన్నించి వాసుకి పడగ నీడలో శ్రీస్వామివారు వెలిసినట్లు కథ ప్రచారంలో ఉంది.
ఆలయ నిర్మాణం:
ఒకనాడు శ్రీవారు కేశవయ్య అనే భక్తుడికి కలలో కనిపించి మునులకొండపై నేనున్నాను. సేవాకార్యక్రమాలు నిర్వహించాల్సిందిగా చెప్పి అంతర్థానమవగా, ఆతర్వాత ఆలయం నిర్మించినట్లుగా తెలుస్తున్నది.
రవాణా సౌకర్యాలు:
ఈ క్షేత్రం జిల్లా కేంద్రం నుంచి 20 కిమీ దూరంలో ఉన్నది. ప్రధాన రహదారి వదిలి 3 కిమీ ఘాట్ రోడ్ పై వెళ్ళవలసి ఉంటుంది. మహబూబ్‌నగర్- రాయచూరు ప్రధాన రహదారిపై ఉన్న మన్యంకొండ గేట్ నుంచి కొండపైకి వెళ్ళడానికి ప్రవేటు వాహనాలు అందుబాటులో ఉంటాయి. ప్రతి శనివారం, పర్వదినాలలో భక్తులు అధిక సంఖ్యలో విచ్చేస్తారు. రైలు ద్వారా వచ్చేవారు కోటకదిర స్టేషన్ వద్ద దిగవలసి ఉంటుంది. కాని ఎక్స్‌ప్రెస్ రైళ్ళు ఈ స్టేషన్‌లో ఆగవు. రైళ్ళద్వారా దూరప్రాంతాల నుంచి వచ్చేవారు మహబూబ్‌నగర్ స్టేషన్‌లోనే దిగి బస్సుల ద్వారా రావలసి ఉంటుంది.
విభాగాలు: పాలమూరు జిల్లా దేవాలయాలు, దేవరకద్ర మండలము, |
Om namo venkateshaya
రిప్లయితొలగించండి