ఈ మండలం నిర్మల్ జిల్లాకు చెందినది. ఈ మండలము నిర్మల్ రెవెన్యూ డివిజన్, నిర్మల్ అసెంబ్లీ నియోజకవర్గం, ఆదిలాబాదు లోకసభ నియోజకవర్గంలో భాగంగా ఉన్నది. మండలము 19° 01' 52'' ఉత్తర అక్షాంశం మరియు 78° 20' 50'' తూర్పు రేఖాంశంపై ఉన్నది. ఈ మండలం గుండా 44వ నెంబరు జాతీయ రహదారి వెళుచున్నది. జాతీయ రహదారిపై గంజాల్ గ్రామం వద్ద టోల్‌ప్లాజా నిర్మించారు. మండలం గుండా శ్రీరాంసాగర్ యొక్క సరస్వతీ కాలువ వెలుతుంది. ఈ మండలంలోని అన్ని గ్రామాలు పూర్వపు నిర్మల్ తాలుకాలోనివే. ఆదిలాబాదు జిల్లా తొలి మహిళా చైర్ పర్సన్ సుమతీరెడ్డి, కేంద్రమంత్రిగా పనిచేసిన సముద్రాల వేణుగోపాలచారి నిర్మల్ కు చెందినవారు. 2011 లెక్కల ప్రకారం మండల జనాభా 139444. నిమ్మనాయుడు నిర్మించిన కోట మండల కేంద్రంలో ఉంది. అనేక చారిత్రక కోటలు, బురుజులున్నాయి.
భౌగోళిక సరిహద్దులు: నిర్మల్ మండలము జిల్లా దక్షిణ సరిహద్దులో గోదావరి నదీ తీరాన ఉన్నది. మండలానికి తూర్పున లక్ష్మణచాంద, మామడ మండలాలు, పశ్చిమాన దిలావర్‌పూర్ మండలం, ఉత్తరాన నేరెడిగొండ, సారంగాపూర్ మండలాలు, దక్షిణాన గోదావరి నది దానికి ఆవల నిజామాబాదు జిల్లా సరిహద్దులుగా ఉన్నాయి. జనాభా: 2001 లెక్కల ప్రకారం మండల జనాభా 121353. ఇందులో పురుషులు 60130, మహిళలు 61223. ఎస్సీలు 12650, ఎస్టీలు 4158. 2001 లెక్కల ప్రకారం జిల్లాలో అత్యధిక జనాభా కల నాలుగవ మండలం ఇది. మండల జనాభాలో పట్టణ జనాభా 75254, గ్రామీణ జనాభా 46099. 2011 లెక్కల ప్రకారం మండల జనాభా 139444. ఇందులో పురుషులు 68420, మహిళలు 71024. పట్టణ జనాభా 88218కాగా గ్రామీణ జనాభా 51226. రవాణా సౌకర్యాలు: మండలం గుండా దేశంలోనే పొడవైన 44వ నెంబరు జాతీయ రహదారి వెళ్ళుచున్నది. నిర్మల్ పట్టణము ప్రముఖ కూడలి. భైంసా- మంచిర్యాల మార్గము కూడా నిర్మల్ నుంచే వెళ్ళుచున్నది. హైదరాబాదు, ఆదిలాబాదు, భైంసా, మంచిర్యాల తదితర ముఖ్యపట్టణాల నుంచి మంచి బస్సు సదుపాయాలున్నాయి. మండలానికి రైలుసదుపాయము లేదు. ఆదిలాబాదు నుంచి నిర్మల్, ఆర్మూర్ ల గుండా కొత్త రైల్వే మార్గానికి ప్రతిపాదన ఉంది. రాజకీయాలు: నిర్మల్ మండలం నిర్మల్ అసెంబ్లీ నియోజకవర్గం, ఆదిలాబాదు లోకసభ నియోజకవర్గంలో భాగము. ఆదిలాబాదు జిల్లా తొలి మహిళా చైర్ పర్సన్ సుమతీరెడ్డి, కేంద్రమంత్రిగా పనిచేసిన సముద్రాల వేణుగోపాలచారి, ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి పట్టణానికి చెందినవారు.
= = = = =
సంప్రదించిన గ్రంథాలు, వెబ్‌సైట్లు:
|
Tags: about Nirmal Mandal in Telugu, Nirmal Dist Mandals information in Telugu,
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి