మహబూబ్‌నగర్ పట్టణ పాలక సంస్థ అయిన మహబూబ్‌నగర్ పురపాలక సంఘము జిల్లాలోని 11 పురపాలక/నగర పంచాయతీలలో పెద్దది. 1952లో మూడవశ్రేణి పురపాలక సంఘంగా ఏర్పడింది. 1959లో రెండోగ్రేడుగా, 1983లో మొదటి గ్రేడుగా, 2004లో స్పెషల్ గ్రేడుగా అప్‌గ్రేడ్ చెందింది. 2012లో సమీపంలోని 10 పంచాయతీలు ఈ పురపాలక సంఘం పరిధిలో చేర్చి సెలెక్షన్ గ్రేడు పురపాలక సంఘంగా మార్చారు. దీన్ని నగరపాలక సంస్థగా చేయాలనే ప్రతిపాదనను కూడా ప్రభుత్వానికి పంపిననూ వాస్తవరూపం దాల్చలేదు. ప్రస్తుతం పురపాలక సంఘంలో 41 వార్డూలున్నాయి. ఈ పురపాలక సంఘంలో కౌన్సిలర్లుగా, చైర్మెన్లుగా పనిచేసిన పలువురు తదనంతర
కాలంలో శాసనసభ్యులుగా, మంత్రులుగా, పార్టీ జిల్లా అధ్యక్షులుగా రాణించారు.
చరిత్ర: ఈ పురపాలక సంఘానికి పెద్ద శంకర్ రావు తొలి చైర్మెన్‌గా పనిచేశారు. రెండో చైర్మెన్‌గా పనిచేసిన స్వాతంత్ర్య సమరయోధుడు ఆర్.శ్రీనివాసరావు పాలమూరు పురపాలక సంఘం పితామహుడిగా పరిగణించబడతారు. ఆ తర్వాత చైర్మెన్‌గా పనిచేసిన ఇబ్రహీం అలీ అన్సారి రాష్ట్ర మంత్రిగా పనిచేశారు. పురపాలక సంఘం స్వర్ణోత్సవాల సమయంలో చైర్మెన్‌గా ఉన్న ముత్యాల ప్రకాష్ డీసిసి అధ్యక్షులుగా పనిచేశారు. కౌన్సిలర్‌గా పనిచేసిన పి.చంద్రశేఖర్ తెలుగుదేశం పార్టీ తరఫున 4 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నిక కావడమే కాకుండా రాష్ట్ర మంత్రిగానూ బాధ్యతలు చేపట్టారు. జనాభా: పురపాలక సంఘం పరిధిలో 2001 నాటికి జనాభా 130986 కాగాం 2011 నాటికి 157902కు పెరిగింది. ఆదాయము: 2010-11 ఆర్థిక సంవత్సరం నాటికి ఈ సంఘం ఆదాయం 703.70 లక్షలు, వ్యయము 603.28 లక్షలు. ప్రస్థానం: 1952లో 15 వార్డులతో ఏర్పడిన పాలమూరు పురపాలక సంఘం అప్పట్లో మూడవ గ్రేడు పురపాలక సంఘంగా ఉండేది. 1959లో రెండవ గ్రేడు హోదా పొందింది. 1983లో ప్రథమ శ్రేణి గ్రేడు పొంది 2004లో స్పెషన్ గ్రేడ్ హోదాకు అప్‌గ్రేడ్ చేయబడింది. 2012 నాటికి 38 వార్డులు ఉండగా సమీపంలోని 10 గ్రామపంచాయతీలను విలీనం చేయడంతో విస్తీర్ణం, జనాభా పెరగడమే కాకుండా వార్డూల సంఖ్య కూడా పెరిగి 41కు చేరింది. ఈ పురపాలక సంఘానికి 1952లో తొలిసారిగా ఎన్నికలు జరుగగా కాంగ్రెస్ పార్టికి చెందిన శంకర్ రావు తొలి చైర్మెన్‌గా ఎన్నికయ్యారు. అప్పటినుంచి 10 సార్లు ఎన్నికలు జరిగాయి. 2014, మార్చి 30న మళ్ళీ ఎన్నికలు నిర్వహిస్తున్నారు. 2000 ఎన్నికలు: 2000లో జరిగిన పురపాలక సంఘం ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ 9 స్థానాలలో విజయం సాధించగా, కాంగ్రెస్ పార్టీ 8 స్థానాలలో గెలుపొందినది. భారతీయ జనతాపార్టీ 6, ఎంఐఎం 2, ఇతరులు 7 స్థానాలలో విజయం సాధించారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన ముత్యాల ప్రకాష్ చైర్మెన్‌గా ఎన్నికైనారు. వీరి హయంలోనే 2002లో పాలమురు పురపాలక సంఘం స్వర్ణోత్సవాలు జరుపుకుంది. 2005 ఎన్నికలు: 2005 అక్టోబరులో జరిగిన పురపాలక సంఘం ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి మెజారిటీ సీట్లు రాగా ఒబేదుల్లా కొత్వాల్ చైర్మెన్‌గా, పులి అంజనమ్మ వైస్-చైర్మెన్‌గా ఎన్నికయ్యారు. 2014 ఎన్నికలు: 2014 మార్చి 30న ఎన్నికలు జరుగగా మే 12న కౌంటింగ్ జరిగింది. 41 వార్డులకు గాను కాంగ్రెస్ పార్టీ 14, తెలంగాణ రాష్ట్ర సమితి 7, భారతీయ జనతాపార్టీ 6, ఎంఐఎం 6, తెలుగుదేశం పార్టీ 3, వైకాపా 1. ఇతరులు 4 స్థానాలలో విజయం సాధించాయి.
= = = = =
|
Tags: Mahabubnagar Muncipality, Palamuru Muncipality, 2014 Muncipality Councilors names,
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి