మహబూబ్‌నగర్ పట్టణంలోని చారిత్రాత్మక కట్టడం తూర్పు కమాన్ ఎంతో ప్రసిద్ధి చెందింది. నాటి స్వాతంత్ర్యోద్యమ స్పూర్తికి ఇది చిహ్నం. దేశానికి స్వాతంత్ర్యం వచ్చాక ఇంకనూ నిజాం నిరంకుశ పాలనలో ఉన్న రోజుల్లో కొందరు దేశభక్తి కల ఉద్యమకారులు తూర్పుకమాన్ పై జాతీయ జెండాను ఎగురవేయాలని ప్రయత్నించారు. ఇది గ్రహించిన నిజాం సైనికులు, పోలీసులు ఈ ప్రయత్నాన్ని వమ్ము చేయాలని పహరాకాశారు. అయిననూ పోలీసుల కళ్ళుగప్పి ఉద్యమకారులు తూర్పుకమాన్ పై జాతీయజెండాను రెపరెపలాడించి తమ పంతం నెగ్గించుకున్నారు. పోలీసులు సమీపించగా కమాన్‌పై నుంచి దూకి ఉద్యమకారులు పోలీసులకు దొరకకుండా తప్పించుకున్నారు. నిజాం రాజ్యం భారత యూనియన్‌లో విలీనమైన పిదప జాతీయ జెండాని ఇక్కడే ఎగురవేసేవారు. సంస్థానాధీశులచే నిర్మించిన మూడు కమాన్లు, రాజప్రసాదం కట్టడాలలో ఇది ఒకటి. మిగితావి మట్టిలో కలిసిపోగా ఇది మాత్రమే మిగిలింది. హైదరాబాదు-రాయచూరు రహదారిపై నుంచి వెళ్ళేవారికి ఇది కనిపిస్తుంది. తూర్పు కమాన్ ప్రక్కనే రెండు పురాతన ఆలయాలున్నాయి. స్వాతంత్ర్యోద్యమం సమయంలో పట్టణంలో ప్రముఖ పాత్ర వహించిన సీతారామాంజనేయ గ్రంథాలయం ఇక్కడే ఉండేది.
విభాగాలు: మహబూబ్‌నగర్ పట్టణం, |
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి