17, జూన్ 2014, మంగళవారం

ఆడంస్మిత్ (Adam Smith)

 ఆడంస్మిత్
జననం 1723
దేశంబ్రిటన్
రంగంఆర్థికవేత్త, తత్వవేత్త
మరణం1790
అర్థశాస్త్ర పితామహుడిగా పేరుగాంచిన ఆడంస్మిత్ 1723లో స్కాట్లాండ్ లోని కిర్‌కాల్డిలో జన్మించాడు. ఇతను బ్రిటన్ దేశానికి చెందిన ప్రముఖ తత్వవేత్త మరియు ఆర్థికవేత్త. 1776లో రచించిన "వెల్త్ ఆప్ నేషన్స్" గ్రంథం వల్ల ప్రసిద్ధి చెందినాడు. సంప్రదాయ ఆర్థికవేత్త అయిన ఆడంస్మిత్ స్వేచ్ఛా వాణిజ్యం, పెట్టుబడి దారీ విధానం, లిబర్టిలిజం లపై అనేక రచనలు చేసినాడు. అరిస్టాటిల్, హాబ్స్, జాన్ లాక్, ఫ్రాంకోయిస్ కేనే మొదలగు వారి వల్ల ప్రభావితుడైనాడు. స్కాటిష్ తత్వవేత్త డేవిడ్ హ్యూమ్‌తో పరిచయం అతని ఆర్థిక సిద్ధాంతాల అభివృద్ధికి దోహదపడింది. 1776లో హ్యూమ్ మరణించేవరకు వారిమధ్య స్నేహం కొనసాగింది. అర్థశాస్త్ర అభివృద్ధికి ఎంతగానో దోహదపడిన ఆడంస్మిత్ 1790లో మరణించాడు.

బాల్యం:
ఆడంస్మిత్ స్కాంట్లాండ్ లోని కిర్‌కాల్డిలో 1723 జూన్ 5 న జన్మించినాడు. ఇతని తండ్రి కస్టమ్స్ కంట్రోలర్‌గా పనిచేసేవాడు. ఇతని యొక్క సరైన జన్మతేది విషయంలో భిన్నాభిప్రాయాలున్నాయి. స్మిత్ నాలుగేళ్ళ ప్రాయంలో ఉన్నప్పుడు జిప్సీలచే కిడ్నాప్‌కు గురైనాడు. అతని మామ వెంటనే ప్రతిస్పందించి తల్లి వద్దకు చేర్చాడు.

విద్యాభ్యాసం:
15 సంవత్సరాల వయస్సులో ఆడంస్మిత్ గ్లాస్గో విశ్వవిద్యాలయంలో చేరి నైతిక తత్వశాస్త్రం అభ్యసించినాడు. ఇక్కడ ఉన్నప్పుడు స్మిత్ స్వేచ్ఛావాదం, తర్కం ప్రసంగాలలో నైపుణ్యం సంపాదించినాడు. 1740లో స్మెల్ ఎగ్జిబిషన్ అవార్డు పొందినాడు. ఆ తర్వాత ఆక్స్‌పర్డ్ లోని బాలియోల్ కళాశాలలో చేరినాడు. కాని బ్రిటన్ విశ్వవిద్యాలయాలు అతనికి నచ్చలేవు. "వెల్ట్ ఆప్ నేషన్" ఐదో భాగంలో స్మిత్ ఇదే విషయాన్ని చెబుతూ స్కాట్లాండ్ లో పోలిస్తే ఆక్స్‌పర్డ్, కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయాలలో శిక్షణ నాణ్యత అంతగా లేదని వివరించినాడు.

జీవనం:
1748లో స్మిత్ ఎడంన్‌బర్గ్ లో ప్రసంగాలు ఇవ్వడం ప్రారంభించినాడు. 1750 ప్రాంతంలో ప్రముఖ తత్వవేత్త డేవిడ్ హ్యూమ్ ను కలుసుకున్నాడు. అప్పటి నుంచి వారిరువురి మధ్య గాఢస్నేహం కొనసాగింది. ఈ స్నేహం స్మిత్ ఆర్థిక సిద్ధాంతాల అభివృద్ధికి కూడా దోహదపడింది. 1751లో స్మిత్ గ్లాస్గో విశ్వవిద్యాలయంలో తర్క పీఠాన్ని అధిష్టించాడు. 1752లో ఒకప్పుడు అతని గురువైన ప్రాన్సిస్ హచిసన్ అధిష్టించిన నైతిక తర్కశాస్త్రం పీఠాన్ని ఆక్రమించాడు. ఆ స్థానంలో తర్కం నుంచి రాజకీయ అర్థశాస్త్రం వరకు ఉపన్యాసాలను ఇచ్చేవాడు. 1762లో గ్లాస్గో విశ్వవిద్యాలయం డాక్టరేట్ ఆప్ లా (LL.D) ప్రధానం చేసింది. 1773లో విశ్వవిద్యాలయాన్న్ని వదలి హెన్రీ స్కాట్‌కు ట్యూటర్‌గా పనిచేశాడు.అతని వెంబడి 18 మాసాలు ఫ్రాన్సు, స్విట్జర్లాండ్ బయలుదేరాడు. ఆ సమయంలోనే ఫిజియోక్రటిక్ స్కూల్ కు చెందిన అర్థశాస్త్ర మేధావులను కలిసే అవకాశం లభించింది. ఫ్రాన్సుకు చెందిన ఫ్రాంకోయిస్ కేనే, జాక్వెస్ టర్గెట్ ల ప్రభావం అతనిపై పడింది. స్వస్థలం కిర్‌కాల్డి వచ్చిన పిదప లండన్ రాయల్ సొసైటీలో యొక్క ఫెలో గా ఎన్నికయ్యాడు. 1776లో ప్రముఖ రచన వెల్త్ ఆప్ ది నేషన్స్ రచించాడు. 1778లో స్మిత్ స్కాట్లాండ్‌లో కస్టమ్స్ కమీషనర్‌గా నియమించబడ్డాడు. 1783లో ఎడింబర్గ్ రాయల్ సొసైటీ సంస్థాపక సభ్యులలో ఒకడిగా అవతరించినాడు. 1787 నుంచి 1789 వరకు గ్లాస్గో విశ్వవిద్యాలయపు రెక్టార్‌గా కొనసాగినాడు. 1790, జూలై 17న స్మిత్ మరణించినాడు.

వెల్త్ ఆప్ నేషన్స్:
వెల్త్ ఆప్ నేషన్స్ ఆడంస్మిత్ యొక్క ప్రముఖ రచనే కాకుండా అర్థశాస్త్రపు ప్రముఖ రచనగా కూడా చెప్పవచ్చు. 1776లో రచించిన ఈ గ్రంథం పూర్తి పేరు "An Inquiry into the Nature and Causes of the Wealth of Nations". అర్థశాస్త్రానికి సంబంధించి అత్యంత విలువైన అభిప్రాయాలను స్మిత్ ఈ గ్రంథంలో వెలుబుచ్చినాడు. దానివలననే స్మిత్‌ అర్థశాస్త్ర పితామహుడిగా పేరుగాంచాడు. ఆడంస్మిత్ తోనే అర్థశాస్త్రం ప్రారంభమైందని చెప్పవచ్చు. అంతకు ముందు అర్థశాస్త్ర భావాలున్ననూ అవి ఒక ప్రత్యేక శాస్త్రంగా కాకుండా తర్కశాస్త్రం, నైతికశాస్త్రం, రాజకీయాలు మొదలగు వాటిలో ఇమిడి ఉండేది. ఒక ప్రత్యేక శాస్త్రంగా అర్థశాస్త్రాన్ని తీర్చిదిద్దిన ఘనత ఆడంస్మిత్‌కే దక్కింది.

స్మిత్ వెల్త్ ఆప్ నేషన్స్‌లో ఫిజియోక్రాట్ ఆర్థికవేత్తల భూమే అన్నింటికి సర్వస్వం అనే భావనను తిప్పికొట్టాడు. స్మిత్ అభిప్రాయంలో భూమితో పాటు శ్రమ కూడా ప్రధానమైనది. శ్రమ విభజన వల్ల ఉత్పత్తి అనూహ్యంగా పెర్గుతుందని ఉదాహరణలతో సహా వర్ణించాడు. స్మిత్ తరువాతి ఆర్థికవేత్తలు కూడా అతని అభిప్రాయాలనే బలపర్చినారు. ముఖ్యంగా థామస్ రాబర్ట్ మాల్థస్ మరియు డేవిడ్ రికార్డోలు స్మిత్ సిద్ధాంతాలనే మెరుగుపర్చినారు. స్మిత్ తర్వాతి ఆర్థికవేత్తలు సంప్రదాయ ఆర్థికవేత్తలుగా పేరు పొందినారు. శ్రామికుల వేతనాలు పెంచితే జనాభా పెరుగుతుందని స్మిత్ వెలుబుచ్చిన అభిప్రాయాలు నేటి పరిస్థితులకు కూడా దర్పణం పడుతుంది. అట్లే ఆడంస్మిత్ తన మహా గ్రంథంలో స్వేచ్ఛా ఆర్థిక విధానాన్ని బలపర్చినాడు. ఈ విధానం ఉత్పత్తి పెర్గుదలకు సహకరిస్తుందని దీనికి అదృశ్యహస్తం కారణమని పేర్కొన్నాడు.

ప్రముఖ రచనలు:
ఆడంస్మిత్ రచించిన ప్రముఖ రచనలు :
  • The Theory of Moral Sentiments (1759)
  • An Inquiry Into the Nature and Causes of the Wealth of Nations (1776)
  • Essays on Philosophical Subjects (published posthumously 1795)
  • Lectures on Jurisprudence (published posthumously 1976)
  • Lectures on Rhetoric and Belle Lettres 

విభాగాలు: ఆర్థికవేత్తలు, బ్రిటన్ ప్రముఖులు, 18వ శతాబ్దం, 


 = = = = =


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక