జటప్రోలు సంస్థానము మహబూబ్ నగర్ జిల్లాలో కృష్ణానది తీరాన వెలిసిన ఒక అత్యంత ప్రాచీనమైన సంస్థానము. ఈ సంస్థానాధీశులు చివరిదశలో కొల్లాపూరును రాజధానిగా చేసుకొని పరిపాలించడం వల్ల ఈ సంస్థానాన్ని కొల్లాపూరు సంస్థానమనికూడా వ్యవహరిస్తారు. వీరు మొదట జటప్రోలు రాజధానిగా పాలించి తర్వాత కొల్లాపూర్, పెంట్లవెల్లి రాజధానులుగా పాలించారు. ఈ సంస్థానం కృష్ణా నది ఒడ్డున ఉన్న సువిశాలమైన నల్లమల్ల అటవీ ప్రాంతమునందు విస్తరించి ఉండేది. వీరి పాలన ఎప్పుడు ప్రారంభమైందనే విషయం ఖచ్చింతంగా వెలుగులోకి రాలేదు. అయితే చారిత్రక పరిశోధకుల ప్రకారం క్రీ.శ.6-7 వ శతాబ్దిలో వీరి పాలన ప్రారంభమైనట్లు తెలుస్తుంది. పాలకులందరూ సురభి వంశస్థులే. అందుకే వీరికి సురభి సంస్థానాధీశులందురు. ఈ సంస్థానములో క్రీ.పూ. 2వ శతాబ్దముకు చెందిన పురావస్తు సంపదల ఆనవాళ్లు కలవు. 1500 సంవత్సరాలకు పూర్వము కట్టించిన అనేక వందల పురాతన దేవాలయములను నేటికీ ఈ ప్రాంతంలో ఉన్నాయి. కృష్ణానది ఒడ్డునే కల ప్రముఖమైన సోమశిల దేవాలయం ఈ సంస్థానానికే చెందినది. నిజాము యొక్క పరిపాలనలో జటప్రోలు సంస్థానము చెప్పుకోదగిన పాత్ర పోషించినది. స్వాతంత్ర్య సమరయోధుడు మందుముల నర్సింగరావు ఈ సంస్థానాధీశుల బంధువే. ఇతను కొల్లాపూర్ నుంచి ఎన్నికై మంత్రి పదవి కూడా చేపట్టారు.
చరిత్ర
పిల్లలమర్రి బేతల రెడ్డి / నాయుడు జటప్రోలు సంస్థానాధీశుల యొక్క మూలపురుషుడే కాక, గంజాం జిల్లాలోని బొబ్బిలి రాజ వంశము, గోదావరి జిల్లాలోని పిఠాపురం, కృష్ణా జిల్లా లోని మల్లేశ్వరం మరియు నెల్లూరు జిల్లాలోని వెంకటగిరి మొదలైన రాజ వంశములకు మూలపురుషుడని చరిత్రకారుల భావన. 15వ శతాబ్దం చివరిలో ఈ వంశానికి చెందిన మాదానాయుడు కృష్ణ, తుంగభద్ర సంగమ సమీపంలోని జటప్రోలు ప్రాంతానికి వచ్చి అక్కడ కోటను కట్టడం ప్రారంభించాడు. మూడు తరాల తర్వాత ఈయన వారసులలో ఒకడైన మల్ల భూపతినాయుడు 1507లో విజయనగర రాజులనుండి ఈ ప్రాంతాన్ని పాలించడానికి ఉత్తర్వును పొందాడు. కృష్ణదేవరాయల పట్టాభిషేకానికి వెలుగోటి నాయకునిగా విచ్చేసిన సామంతుడు ఈయనేనని చరిత్రకారుల అభిప్రాయం. కాకతీయ, విజయనగర సామ్రాజ్యాలు ఈ సంస్థానాధీశులకు సైనిక పోషణకై పట్టాలిచ్చారు. కానీ ఆయా సామ్రాజ్యల పతనం చెందినప్పుడు సంస్థానాధీశులు చాకచక్యంతో తమ రాజ్యాన్ని నిలబెట్టుకొని దక్షిణాపథంలో కొత్తగా ఆవిర్భవించిన శక్తులతో మనగలిగారు. 1513లో అప్పుడే కొత్తగా ఏర్పడిన గోల్కొండ సామ్రాజ్యంపై దండయాత్రకు సన్నాహాలు చేస్తూ, కృష్ణదేవరాయలు యుద్ధబలగాలను బేరీజు వేయటానికి, ఇతర సామంతులతో పాటు జటప్రోలు రాజు వెలుగోటి యాచమ నాయున్ని కూడా పిలిపించాడు. ఆ సంవత్సరం రాయచూరు అంతర్వేదిలో జరిగిన యుద్ధంలో జటప్రోలు సంస్థానము కూడా పాల్గొన్నది.
ఔరంగజేబు దక్షిణాపథంపై దండెత్తి కుతుబ్‌షాహీలను ఓడించినప్పుడు స్థానిక రాజవంశాలను నిర్మూలించక, వాటిని తన నియమించిన దండనాయకుని ఆధీనంలో వీటిని తన రాజ్యంలో సామంతులుగా విలీనం చేసుకున్నాడు. అప్పటి నుండి జటప్రోలు సంస్థానం యొక్క స్వాధికారత మరియు ప్రాబల్యం పెరగటం ప్రారంభమైంది. అప్పటి సంస్థానాధీశుడు గోపాలరావు జటప్రోలు యొక్క ప్రాబల్యాన్ని దక్షిణాన జటప్రోలు నుండి ఉత్తరాన పానగల్, యల్జల్ల వరకు విస్తరించి పటిష్ఠపరచాడు. 1694లో సంస్థానాధీశుడైన నరసింగరావు మొఘలులపై తిరుగుబాటు చేసి మొఘులుల మల్లయోధున్ని బంధించి, గంజికోట (గండికోట) మరియు శ్రీకాకుళంపై ఆధిపత్యం కావాలని పట్టుబట్టాడు. మొఘలులు ఈయన్ను తృప్తిపరచడానికి వీటిపై అధికారమిచ్చారు.
19వ శతాబ్దం చివరలో జటప్రోలు సంస్థాధీశునికి సంతానము కలుగక వారసుడు లేని పరిస్థితి వచ్చింది. అప్పటికే పొరుగు సంస్థానాలైన వనపర్తి, గద్వాలలో జరుగుతున్న వారసత్వపు పోరులను గమనించిన జటప్రోలు రాజు, ముందు జాగ్రత్త చర్యగా వెంకటగిరి రాజకుమారుడిని దత్తత పుచ్చుకున్నాడు. ఈయన జటప్రోలు రాజా సింహాసనము అధిరోహించిన తర్వాత తన అసలు పేరు నవనీతకృష్ణ యాచేంద్రను విడిచి రాజా వెంకట లక్ష్మణరావు బహుదూర్ అనే పట్టము స్వీకరించాడు. ఆయనకు ఇద్దరు కుమార్తెలు. వెంకట లక్ష్మణరావు 1929లో మరణించాడు.
జటప్రోలు సంస్థానాన్ని సుమారు పదహారు తరాలుగా కొన్ని శతాబ్దాల పాటు పరిపాలన కొనసాగించిన 'సురభి' రాజులంటే కొల్లాపూర్ ప్రాంత జనులకు వల్లమాలిన అభిమానం. వీరి పరిపాలన 7, 8 వందల సంవత్సరాల క్రితం నుంచే ప్రారంభమైనట్లు చరిత్రకారులు చెబుతారు. కొల్లాపూర్ ప్రాంతంలో చారిత్రక భవనాలు, దేవాలయాలతో పాటు అనేకం సురభి రాజ వంశీయులు నిర్మించినవే. జటప్రోలు సంస్థానాధీశుల కోటను మల్ల నాయుడు నిర్మించగా, సింగపట్నంలోని నృసింహ సాగరాన్ని మాధవరాయుడు, పెంట్లవెల్లి గ్రామంలోని కోటను, చెరువును, శివ కేశవాలయాన్ని చిన్నమాధవ రావు, కొల్లాపూర్ కోటను ప్రథమ వేంకటలక్ష్మా రావు, జటప్రోలు మదన గోపాల స్వామి ఆలయాన్ని మాధవరాయులు, బెక్కం, చిన్నమారూరు కోటల్ని నరసింగ రావులు నిర్మించారు. వీటితో పాటు శింగవట్నంలోని శ్రీవారి సముద్రం, జటప్రోలు హజ్రత్ ఇనాయత్ షా ఖాద్రి దర్గా, అద్దాల మేడ, కొల్లాపూర్ లోని న్యాయ దర్బార్ గా పిలిచే గుండు బంగ్లా, జైలు ఖానాలను సురభి రాజులు వారి పాలనలో నిర్మించారు.
సురభి వంశస్తుల పాలనలో కొల్లాపూర్ ప్రాంతం చాలా అభివృద్ది చెందింది. 1871 లో నిర్మించిన కొల్లాపూర్ రాజా బంగ్లాను చంద్ర మహల్, మంత్ర మహల్, రాణి మహల్ గా విభజించి సుందరంగా నిర్మించారు. 140 సంవత్సరాల క్రితం నాటి మునసబ్ కోర్టు జిల్లాలోనే ప్రథమ న్యాయస్థానం ఇక్కడ కలదు. కొల్లాపూర్ పట్టణంలో విశాలమైన రహదారులు, రహదారులకిరు వైపులా చెట్లు, డ్రైనేజీ వ్యవస్థ ఆనాడే ఏర్పాటు చేసారు. జనరేటర్ ఉపయోగించి విద్యుత్తును వినియోగించిన ఘనత కూడా వారికే దక్కుతుంది. త్రాగునీటి సరఫరా పైపులైను ఏర్పాటు చేసి కుళాయిలు ఆనాడే ఏర్పాటు చేసారు. 18 వ శతాబ్దం కాలంలోనే జటప్రోలు సంస్థానాధీశుల అధ్వర్యంలో కొల్లాపూర్ పట్టణంలో పేదలకు ఉచితంగా వైద్య సేవలు అందించేందుకు ధర్మాసుపత్రిని కూడా ఏర్పాటు చేసారు. హైటెక్ పరిజ్ఞాన వినియోగంలో సురభి వంశస్థులదే అందె వేసిన చేయి. సురభి వంశస్థులు ప్రపంచ విపణిలో ఏ కొత్త వస్తువు వచ్చినా వాటిని వినియోగించుకునేవారు. వీరికి ఒక సొంత విమానం కూడా ఉండేదని. దానికి ఎయిర్ పోర్టుగా కొల్లాపూర్ పట్టణంలోని జఫర్ మైదానాన్ని ఉపయోగించినట్లుగా చెబుతారు.
సురభి రాజ వంశ వారసుడైన బాలాదిత్య లక్ష్మారావు (ఇతను సంస్థానం చివరి రాజు జగన్నాథరావు కుమారుడు) హైదరాబాదులో నివాసం ఏర్పరుచుకున్నారు. కొల్లాపూర్ సంస్థానానికి మంత్రిగా పని చేసిన మియాపురం రామక్రిష్ణారావు ప్రముఖ బ్రాహ్మణుడు. వీరు గొప్ప కవి. ఎన్నో గేయాలు రచించారు.
= = = = =
సంప్రదించిన గ్రంథాలు, వెబ్ సైట్లు:
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి