భూత్పూర్ మహబూబ్ నగర్ జిల్లా భూత్పూర్ మండలమునకు చెందిన పట్టణము మరియు మండల కేంద్రము. ఈ పట్టణం జిల్లా కేంద్రం మహబూబ్‌నగర్‌కు 8 కిమీ దూరంలో 44వ నెంబరు (పాతపేరు 7వ నెంబరు) జాతీయ రహదారిపై 16°42' ఉత్తర అక్షాంశం, 78°3' తూర్పు రేఖాంశంపై ఉపస్థితియై ఉన్నది. చరిత్రలో బూదపురంగా పిలువబడిన ఈ గ్రామం పలు యుద్ధాలకు స్థానమైంది. తొలి తెలుగు కవయిత్రి కుప్పాంబిక వేయించిన శాసనంతో పాటు ఈ గ్రామంలో గోనరెడ్ల పాలకులకు మరియు చాళుక్యులకు సంబంధించిన పలు చారిత్రక ఆధారాలు, శాసనాలున్నాయి. పురాతనమైన నందీశవరాలయం గ్రామం నడిబొడ్డున ఉన్నది. మహబూబ్‌నగర్ నుంచి శ్రీశైలం వెళ్ళు ప్రధాన రహదారి కూడా గ్రామం మీదుగా వెళ్ళుచుండటంతో ఈ గ్రామం ప్రధాన రోడ్డు కూడలిగా మారింది.
2011 గణన ప్రకారం పట్టణ జనాభా 6248. గ్రామ కోడ్ సంఖ్య 575543. ఈ గ్రామం దేవరకద్ర అసెంబ్లీ నియోజకవర్గం, మహబూబ్ నగర్ లోకసభ నియోజకవర్గంలో భాగంగా ఉంది. మొదట జడ్చర్ల తాలుకాలో భాగంగా ఉన్న ఈ గ్రామం 1986లో మండల వ్యవస్థ ఏర్పడిన పిదప ప్రత్యేకంగా మండల కేంద్రంగా మారింది. ఈ గ్రామంలోనే కాకుండా గ్రామ పరిసరాలలో కూడా పలు చారిత్రక ఆధారాలు, శాసనాలు ఉన్నాయి. ఒకప్పుడు రాజధానులుగా వర్థిల్లిన వర్థమానపురం, కందూరు లాంటి చారిత్రక ప్రాంతాలు కూడా గ్రామానికి సమీపంలోనే ఉన్నాయి. గ్రామంలో మండల కార్యాలయాలతో పాటు, పురపాలక సంఘ కార్యాలయం, సహకార పరపతి సంఘం, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, శాఖా గ్రంథాలయం, వ్యవసాయ కార్యాలయం, ఉప-తపాలా కార్యాలయం ఉన్నాయి. శ్రీసత్యసాయి గురుకుల పాఠశాలతో పాటు గ్రామంలో జడ్పీ, మండల పరిషత్తు, ప్రైవేటుకు సంబంధించిన పలు విద్యాసంస్థలున్నాయి. భౌగోళికం, సరిహద్దులు: భౌగోళికంగా ఈ గ్రామం మండలంలో ఉత్తరం వైపున మహబూబ్‌నగర్ మండలము సరిహద్దులో ఉన్నది. ఉత్తరాన మహబూబ్‌నగర్ మండలం ఉండగా, తూర్పున తాడీపర్తి, కొత్తూర్ గ్రామాలు, దక్షిణాన కొత్తమొల్గర, గోప్లాపూర్ ఖుర్డ్ గ్రామాలు, పశ్చిమాన అమిస్తాపూర్ గ్రామం సరిహద్దుగా ఉన్నది. జనాభా: 2001 జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 5110. ఇందులో పురుషులు 2746, మహిళలు 2364. గృహాల సంఖ్య 902. మండలంలో ఈ గ్రామం అమిస్తాపూర్ తర్వాత రెండో పెద్ద గ్రామము. 2011 గణన ప్రకారం గ్రామ జనాభా 6248. ఇందులో పురుషులు 3161, మహిళలు 3087. గృహాల సంఖ్య 1331. అక్షరాస్యత శాతం 55.20%. గ్రామ కోడ్ సంఖ్య 575543.
ఈ ప్రాంతానికి ఎంతో చారిత్రక ప్రాశస్త్యం ఉంది. బృహచ్ఛిలాయుగం నాటి ఆనవాళ్ళు లభించిన బాదేపల్లి, జడ్చర్ల, బిజినేపల్లి ఈ గ్రామానికి సమీపంలో ఉన్నాయి. శాతవాహనుల కాలంలో ఈ ప్రాంతం భాగంగా ఉండేది. క్రీ.శ.3వ శతాబ్దిలో ఇది ఇక్ష్వాకుల పాలనలోకి వెళ్ళింది. ఆ తర్వాత వాకాటకులు, విష్ణుకుండినుల అధీనంలో నుంచి క్రీ.శ.6వ శతాబ్దిలో చాళుక్యుల పాలనలో చేరింది. కళ్యాణి చాళుక్యులకు సంబంధించిన శాసనం కూడా గ్రామంలో ఉంది. క్రీ.శ.10వ శతాబ్దిలో కందూరు చోళుల రాజధాని అయిన కందూరు ఈ గ్రామానికి సమీపంలోనే ఉంది. 12వ శతాబ్దిలో గోనరెడ్లు అధికారంలోకి వచ్చి రాజధానిని వర్థమానపురానికి మార్చారు. ఈ రాజధాని కూడా భూత్పూరు గ్రామ సమీపంలోనిదే. ఈ కాలంలోనే గోన బుద్ధారెడ్డి రంగనాథ రామాయణం రచించాడు. ఇది తెలుగులో తొలి రామాయణం. గోన బుద్ధారెడ్డి సొదరి కుప్పాంబిక ఈ గ్రామంలో ఒక శాసనం వేయించింది. ఇదే బూదపురం శాసనంగా ప్రసిద్ధి చెందింది. ఈమె తెలుగులో తొలి కవయిత్రిగా గణతికెక్కింది. వర్థమానపురం పాలకుడు మల్యాల గుండయ బూదపురం సమీపంలో బానసముద్రం, కుప్పసముద్రం త్రవించాడు. ఇతను 1259లో బూదపురంలో శాసనం వేయించాడు. కాకతీయ గణపతిదేవుడు వర్థమానపురంపైకి దండెత్తి రావడంతో ఈ ప్రాంతం కాకతీయ సామ్రాజ్యంలో భాగమైంది. భూత్పూరు సమీపంలోని పోతులమడుగు గ్రామంలోని శిలాశాసనం ఆధారంగా ఈ ప్రాంతం 13వ శతాబ్దిలో బాదామి చాళుక్యులు ఏలినట్లు చరిత్రకారులు నిర్థారించారు. 14వ శతాబ్దంలో ఇది పద్మనాయక సామ్రాజ్యంలో ఉండింది. ఆ తర్వాత బహమనీలు, కుతుబ్‌షాహీలు, ఆసఫ్‌జాహీలు పాలించారు. 1948, సెప్టెంబరులో నిజాం పాలన నుంచి బయటపడి భారతదేశంలో భాగమైంది. 1948 నుంచి 1956 వరకు హైదరాబాదు రాష్ట్రంలో ఉండి, భాషా ప్రయుక్త రాష్ట్రాల అవతరణతో తెలంగాణ మొత్తంతో పాటు ఆంధ్రప్రదేశ్‌లో భాగమైంది. ప్రారంభంలో ఈ ప్రాంతం నల్గొండ జిల్లాలో భాగంగా ఉండేది. 1870లో నల్గొండను విభజించి నాగర్‌కర్నూలు జిల్లా ఏర్పాటు చేయడంతో ఈ ప్రాంతం కూడా ఆ జిల్లాలో చేరింది. 1883లో మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రం కావడంతో ఈ జిల్లాలో భాగమై కొనసాగుతోంది. 1956 నుంచి 1986 వరకు జడ్చర్ల తాలుకాలో ఉండగా, మండల వ్యవస్థ ఏర్పాటుతో ఈ గ్రామం ప్రత్యేకంగా మండలకేంద్రం అయింది. 2019లో అమిస్తాపూర్‌తో కలిపి భూత్పూర్‌ను పురపాలక సంఘంగా చేశారు.
రాజకీయాలు: ఈ గ్రామం దేవరకద్ర అసెంబ్లీ నియోజకవర్గం, మహబూబ్ నగర్ లోకసభ నియోజకవర్గంలో భాగంగా ఉంది. నియోజకవర్గాల పునర్విభజనకు ముందు జడ్చర్ల అసెంబ్లీ నియోజకవర్గంలో ఉండేది. 2001లో గ్రామ సర్పంచిగా నారాయణరెడ్డి, 2006లో కాట్రావత్ ప్రమీల (ఇండిపెండెంట్) గెలుపొందినారు. 2013, ఫిబ్రవరిలో జరిగిన సహకార సంఘపు ఎన్నికలో సింగిల్ విండోలోని 13 డైరెక్టర్ స్థానాలలో పదింటిని తెరాస, రెండు తెలుగుదేశం పార్టీ, ఒక స్థానంలో కాంగ్రెస్ పార్టీ గెలుపొందాయి. 2013, జూలై 23న జరిగిన పంచాయతి ఎన్నికలలో సర్పంచిగా టి.శోభాదేవి ఎన్నికైనారు. విద్యాసంస్థలు: గ్రామంలో రెండు మండల పరిషత్తు ప్రాథమిక పాఠశాలలు, ఒక ఉర్దూమీడియం మండల పరిషత్తు ప్రాథమిక పాఠశాల, ఒక జిల్లాపరిషత్తు ఉన్నత పాఠశాల, ఒక మండల పరిషత్తు ప్రాథమికోన్నత పాఠశాల, ప్రైవేట్ పాఠశాలలు (శ్రీసత్యసాయి గురుకులం ఉన్నత పాఠశాల, న్యూటాలెంట్ స్కూల్, వివేకానంద విద్యాలయం) కలవు. అనుబంధ గ్రామాలైన సేరిపల్లి, నర్సింగ్‌పూర్, మీట్యాతండా, హన్మ్యాతండా, వాల్యాతండాలలో మండల పరిషత్తు ప్రాథమిక పాఠశాలలున్నాయి.
భూత్పూర్ పట్టణపాలన పురపాలక సంఘంచే నిర్వహించబడుతుంది. 2019లో పురపాలక సంఘంగా మారడానికి ముందు గ్రామపంచాయతీలో 14 వార్డులు ఉండేవి. 2013, జూలై 23న జరిగిన పంచాయతి ఎన్నికలలో టి.శోభాదేవి సర్పంచిగా ఎన్నికైనది. పారిశుద్ధ్యం, వీధిదీపాల ఏర్పాటు, త్రాగునీటి సరఫరా ప్రస్తుతం పురపాలిక ముఖ్యవిధులు. కేంద్ర-రాష్ట్ర ఆర్థిక సంఘం నిధుల నుంచి పలు నిర్మాణ పనులు కూడా జరిగాయి. జతీయ రహదారిపై ఉన్న ఫ్లైఓవర్ ప్రక్కనే (జడ్చర్ల వైపు) పురపాలక సంఘం కార్యాలయం ఉంది. ఆదాయవనరులు: పురపాలక సంఘానికి ముఖ్యంగా వసూలు చేసే ఆస్తిపన్నులు, నీటి పన్నులు, లైసెన్స్ ఫీజు, అనుమతి ఫీజుతదితరాలే కాకుండా 14వ ఆర్థిక సంఘం నిధులు, రాష్ట్ర ఆర్థిక సంఘం నిధులు కూడా లభిస్తాయి. ఆర్థిక సంఘం నిధుల నుంచి నిర్మాణాత్మకమైన పనులు అనగా కాల్వల నిర్మాణం, స్లాబుల నిర్మాణం, ప్రహరీ గోడలు, బోర్‌వెల్స్ వేయడం తదితరాలకై వినియోగించబడుతుంది. వాతావరణం, వర్షపాతం: ఈ గ్రామం 16 డిగ్రీల ఉత్తర అక్షాంశంపై ఉండుట వల్ల జిల్లాలోని ఇతర ప్రాంతాల వలె ఇక్కడ కూడా వేసవిలో వేడిగా ఉంటుంది. ఏప్రిల్, మేలలో 39 డిగ్రీల సెంటిగ్రేడ్ వరకు గరిష్ట ఉష్ణోగ్రత, డిసెంబరు-జనవరిలలో 16 డిగ్రీల సెంటిగ్రేడ్ వరకు కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదు అవుతుంటాయి. ఈ గ్రామము సరాసరి వార్షిక వర్షపాతం 626 మిల్లిమీటర్లు. ఇందులో అధికభాగం జూన్-జూలై మాసాలలో నైరుతి రుతుపవనాల వల్ల కురుస్తుంది. వ్యవసాయం, పంటలు: పట్టణ ప్రజల ప్రధాన జీవనాధారం వ్యవసాయము. గ్రామంలో పండించే ముఖ్యమైన పంట వరి. మొక్కజొన్న, జొన్నలు, కందులు కూడా పండిస్తారు. వరి పంట ఖరీఫ్ మరియు రబీలలో పండగా, మొక్కజొన్న, జొన్నలు, కందులు ఖరీఫ్‌లో మాత్రమే పండుతుంది. ఇక్కడ పండించే పంటను వ్యవసాయదారులు జడ్చర్ల లేదా మహబూబ్‌నగర్ మార్కెట్ కమిటీలకు తరలించి విక్రయిస్తారు. ఇవి కాకుండా కూరగాయలు పండించి స్థానికంగా విక్రయిస్తారు. ప్రతి ఆదివారం రోజు జాతీయ రహదారి ప్రధాన కూడలి వద్ద పెద్ద సంత జరుగుతుంది. కాలరేఖ:
= = = = =
సంప్రదించిన గ్రంథాలు, వెబ్‌సైట్లు:
|
5, మే 2013, ఆదివారం
భూత్పూర్ (Bhuthpur)
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
Index
తెలుగులో విజ్ఞానసర్వస్వము
|
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు, సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, వార్తలు, సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు, |
విభాగాలు: |
------------
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి