27, జూన్ 2013, గురువారం

పి.వి.నరసింహారావు (P.V.Narasimha Rao)

పి.వి.నరసింహారావు
(1921-2004)
జననంజూన్ 28, 1921
స్వస్థలంవంగర (వరంగల్ పట్టణ జిల్లా)
పదవులుముఖ్యమంత్రి (1971-73), ప్రధానమంత్రి (1991-96),
మరణండిసెంబరు 23, 2004
భారతదేశ ప్రధానమంత్రిగా, అవిభక్త ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేసిన పాములపర్తి వెంకట నరసింహారావు జూన్ 28, 1921న జన్మించారు. వరంగల్ పట్టణ జిల్లా భీమదేవరపల్లి మండలం వంగర గ్రామం వీరి స్వగ్రామం. పి.వి.గా అందరికి సుపరిచితులైన వీరు 1971-73 కాలంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేశారు. అంతకు క్రితం రాష్ట్ర మంత్రివర్గంలో న్యాయ, ఆరోగ్య శాఖ మంత్రిగా పనిచేశారు. 1991-96 కాలంలో ప్రధానమంత్రిగా బాధ్యతలు నిర్వహించి ఈ పదవి చేపట్టిన తొలి దక్షిణాది వ్యక్తిగా రికార్డు సృష్టించారు. పలు భాషలలో నిష్ణాతులైన పి.వి. విశ్వనాథ సత్యనారాయణ రచించిన వేయిపడగలను సహస్రఫణ్ పేరుతో హిందీలో అనువదించారు. ది ఇన్‌సైడర్ పేరుతో స్వీయచరిత్రను కూడా రచించారు. రాజకీయాలలో అపర చాణుక్యుడిగ్ ఫేరుగాంచిన పి.వి. డిసెంబరు 23, 2004న మరణించారు.

బాల్యం, విద్యాభ్యాసం:
పి.వి.నరసింహారావు వరంగల్ జిల్లా నర్సంపేట మండలం లక్నేపల్లి గ్రామంలో 1921 జూన్ 28 న రుక్నాబాయి, సీతారామారావు దంపతులకు జన్మించారు. వరంగల్లు జిల్లాలోనే ప్రాథమిక విద్య మొదలుపెట్టారు. తరువాత కరీంనగర్ జిల్లా భీమదేవరపల్లి మండలం వంగర గ్రామానికి చెందిన పాములపర్తి రంగారావు, రుక్మిణమ్మలు ఆయనను దత్తత తీసుకోవడంతో అప్పటినుండి పాములపర్తి వెంకట నరసింహారావు అయ్యారు. 1938 లోనే హైదరాబాదు రాష్ట్ర కాంగ్రెసు పార్టీలో చేరి నిజాం ప్రభుత్వ నిషేధాన్ని ధిక్కరిస్తూ వందేమాతరం గేయాన్ని పాడినందుకు ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి బహిష్కరణకు గురయ్యారు. నాగపూరు విశ్వవిద్యాలయంలో చేరి న్యాయశాస్త్రం అభ్యసించారు. స్వామి రామానంద తీర్థ, బూర్గుల రామకృష్ణారావుల అనుయాయిగా స్వాతంత్ర్యోద్యమంలోను, హైదరాబాదు విముక్తి పోరాటంలోను పాల్గొన్నారు. 1951 లో అఖిల భారత కాంగ్రెసు కమిటీ లో సభ్యుడిగా స్థానం పొందారు.

రాజకీయ జీవితం:
1957లో మంథని నియోజక వర్గం నుండి శాసనసభకు ఎన్నికవడం ద్వారా పీవీ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రస్థాయి పదవీ రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. ఇదే నియోజకవర్గం నుండి వరుసగా నాలుగు సార్లు శాసన సభ్యునిగా ఎన్నికయ్యారు. 1962 లో మొదటిసారి రాష్ట్రమంత్రి అయ్యారు. 1962 నుండి 1964 వరకు న్యాయ, సమాచార శాఖ మంత్రి గాను, 1964 నుండి 67 వరకు న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి, 1967 లో వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి, 1968-71 కాలంలో న్యాయ, సమాచార శాఖ మంత్రి పదవులు నిర్వహించారు. 1969 నాటి ప్రత్యేక తెలంగాణా ఉద్యమం అప్పుడే చల్లారింది. ముఖ్యమంత్రిని మార్చడమనేది కాంగ్రెసు పార్టీ ముందున్న తక్షణ సమస్య. తెలంగాణా ప్రజల, ఉద్యమనేతల సెంటిమెంట్లను దృష్టిలో ఉంచుకుని తెలంగాణా ప్రాంత నేతను ముఖ్యమంత్రిగా ఎంపిక చెయ్యడమనేది అనివార్యమయింది. వివాదాల జోలికి పోని ఆయన వ్యక్తిత్వం, పార్టీలోని ఏ గ్రూపుకూ చెందని ఆయన రాజకీయ నేపథ్యం ఆయనకు 1971 సెప్టెంబర్ 30 న ముఖ్యమంత్రి పదవిని సాధించిపెట్టాయి.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా:
ముఖ్యమంత్రి పీఠం ఎక్కగానే పార్టీలో అసమ్మతి తలెత్తింది. ఆ సమయంలోనే ముల్కీ నిబంధనలపై సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పుతో ఆందోళన చెందిన కోస్తా, రాయలసీమ నాయకులు ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం కోరుతూ జై ఆంధ్ర ఉద్యమం చేపట్టారు. పీవీని తెలంగాణా నాయకుల పక్షపాతిగా ఆంధ్ర, రాయలసీమ నాయకులు ఆరోపించారు. ఉద్యమంలో భాగంగా ఆ ప్రాంత మంత్రులలో చాలామంది రాజీనామా చేసారు. రాజీనామా చేసిన మంత్రుల స్థానంలో 1973 జనవరి 8 న కొత్త మంత్రులను తీసుకుని పీవీ మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ చేసారు. అయితే పార్టీ అధిష్టానం ఆలోచన పూర్తిగా భిన్నంగా ఉంది. మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ జరిగిన మరునాడే కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాన్ని రద్దు చేసి, శాసనసభను సుప్తచేతనావస్థలో ఉంచి, రాష్ట్రపతి పాలనను విధించింది. ఆ విధంగా పీవీ ముఖ్యమంత్రిత్వం ముగిసింది. 1972లో పీవీ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు శాసనసభ ఎన్నికలలో 70% వెనుకబడిన వారికిచ్చి చరిత్ర సృష్టించారు. తాను ముఖ్యమంత్రిగా ఉండగా భూసంస్కరణలను అమలుపరచేందుకు చర్యలు తీసుకున్నారు.

కేంద్ర రాజకీయాలలో:
లోకసభ సభ్యుడిగా పి.వి. తొలిసారి హనుమకొండ స్థానం నుండి ఎన్నికయ్యారు. రెండోసారి మళ్ళీ హనుమకొండ నుంచే ఎన్నిక కాగా, మూడవసారి ఎనిమిదో లోక్‌సభకు మహారాష్ట్రలోని రాంటెక్ నుండి ఎన్నికయ్యారు. తొమ్మిదో లోక్‌సభకు మళ్ళీ రాంటెక్ నుంచే ఎన్నికయ్యారు. 1980-1989 మధ్య కాలంలో కేంద్రంలో హోంశాఖ, విదేశవ్యవహారాల శాఖ, మానవ వనరుల అభివృద్ధి శాఖ లను వివిధ సమయాల్లో నిర్వహించాడు.

ప్రధానమంత్రిగా:
1991 సార్వత్రిక ఎన్నికలలో పోటీ చేయకుండా, దాదాపుగా రాజకీయ సన్యాసం తీసుకున్నారు. ఆ సమయంలో రాజీవ్ గాంధీ హత్య కారణంగా కాంగ్రెసు పార్టీకి నాయకుడు లేనట్టయింది. ఆ సమయంలో తనకంటూ ప్రత్యేక గ్రూపు లేని పీవీ అందరికీ ఆమోదయోగ్యుడుగా కనిపించారు. దాదాపుగా వానప్రస్థం నుండి తిరిగివచ్చి ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. నంద్యాల లోకసభ నియోజకవర్గం నుండి గంగుల ప్రతాపరెడ్డిచే రాజీనామా చేయించి, అక్కడి ఉప ఎన్నికలో గెలిచి, పీవీ లోకసభలో అడుగుపెట్టారు. ప్రభుత్వానికి సంపూర్ణ మెజారిటీ లేని పరిస్థితిలో కూడా  తన సహజ సిద్ధంగా ఉన్న తెలివితేటలు, కేంద్రంలో వివిధ మంత్రిత్వ శాఖల్లో ఆయనకు ఉన్న అపార అనుభవంతో ఐదు సంవత్సరాల పరిపాలనా కాలాన్ని పూర్తి చేసుకొన్నారు. ఐదేళ్ళ పూర్తి పాలనా కాలాన్నినిర్వహించడం నెహ్రూ, గాంధీ కుటుంబంబాల బయటి మొదటి వ్యక్తి, పీవీయే. మైనారిటీ ప్రభుత్వానికి నేతృత్వం వహిస్తూ కూడా, ఇది సాధించడం ఆయన రాజనీతికి, చాకచక్యానికి నిదర్శనం. అందుకే ఆయన భారత రాజకియాలలో అపర చాణక్యుడుగా పరిగణించబడతారు.

సాహితీవేత్తగా:
బహుభాషా కోవిదుడైన పీవి విశ్వనాథ సత్యనారాయణ రచించిన "వేయిపడగలు"ను సహస్రఫణ్ పేరుతో హిందీలో అనువదించారు. ఈ పుస్తక అనువాదంకై పీవీకి కేంద్ర సాహిత్య అకాడమీ బహుమతి లభించింది. ఇన్‌సైడర్ రచన ఆయన ఆత్మకథ.

పీవీ తెలుగుతో సహా 17 భాషలలో ధారాళంగా మాట్లాడగలిగిన ప్రజ్ఞ ఉండేది. 1983 అలీన దేశాల శిఖరాగ్ర సమావేశంలో స్పానిష్ లో మాట్లాడి క్యూబా అధ్యక్షుడు ఫీడెల్ కాస్ట్రో ను అబ్బురపరచారు. రాష్ట్ర, జాతీయ స్థాయిలలో కీలక పదవులు చేపట్టి, రాష్ట్రం నుంచే కాకుండా పొరుగున ఉన్న మహారాష్ట్ర నుంచి కూడా లోకసభకు ఎన్నికై సాహితీరంగంలో కూడా ప్రతిభ చూపిన పీవి నరసింహరావు  2004 డిసెంబర్ 23న మరణించారు. హైదరాబాదులో నిర్మించిన అతిపొడవైన ఫైఓవర్‌కు ఆయన పేరుపెట్టబడింది.

కుటుంబం:
పి.వి.నరసింహారావు పెద్ద కుమారుడు పి.వి.రంగారావు 2 సార్లు హన్మకొండ నియోజకవర్గం నుంచి శాసనసభకు ఎన్నికయ్యారు. కోట్ల విజయభాస్కర్ రెడ్డి మంత్రివర్గంలో విద్యాశాఖ మంత్రిగా పనిచేశారు. చిన్న కుమారుడు పి.వి.రాజేశ్వరరావు 1996లో సికింద్రాబాదు లోకసభ నియోజకవర్గం నుంచి లోకసభకు ఎన్నికయ్యారు.


ఇవి కూడా చూడండి:


విభాగాలు: కరీంనగర్ జిల్లా రాజకీయ నాయకులుభారతదేశ ప్రధానమంత్రులుఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులు,  కేంద్రమంత్రులు, మంథని అసెంబ్లీ నియోజకవర్గం, హన్మకొండ లోకసభ నియోజకవర్గం, నంద్యాల లోకసభ నియోజకవర్గం, భీమదేవరపల్లి మండలము, 1921లో జన్మించినవారు, 2004లో మరణించినవారు, 


 = = = = =

2 కామెంట్‌లు:

 1. బాల్య దశలో విద్యార్థుల డ్రాప్ అవుట్స్ ను అరికట్టి అక్షరాస్యతను పెంచేందుకు అటెండెన్స్ ప్రాతిపదికన పై తరగతికి ప్రమోషన్ కల్పించడం ఆయన ఆలోచనే. నేరస్థుల మానసిక పరివర్తన కోసం ఓపెన్ జైల్ విధానం ఆయన ప్రారంభించిందే. దేశంలోని అన్ని ప్రాంతాల విద్యార్థులను ఒక్క చోట చేర్చి బాల్య దశలోనే జాతీయ సమైక్యతను పెంపొందించేందుకు నవోదయ విద్యాలయాలకు రూప కల్పన చేసింది ఆయనే. అన్నిటికీ మించి దేశం అప్పుల పాలై కృంగిపోతున్న సమయంలో ఆర్థిక సంస్కరణలు ప్రారంభించి అభివృద్ధి పథంలో దేశాన్ని గొప్ప మలుపు త్రిప్పిన మహనీయుడు ఆయనే!
  ఈ విషయాలన్నీ చేర్చి పై వ్యాసాన్ని సమగ్రం చేయండి.

  రిప్లయితొలగించు

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

   విభాగాలు: 
   ------------ 

   stat coun

   విషయసూచిక