కొందుర్గ్ రంగారెడ్డి జిల్లాకు చెందిన మండలము. ఇది జిల్లాలో ఉత్తరం వైపున రంగారెడ్డి జిల్లా సరిహద్దులో ఉన్నది. ఈ మండలము షాద్‌నగర్ రెవెన్యూ డివిజన్, షాద్ నగర్ అసెంబ్లీ నియోజకవర్గం, మహబూబ్‌నగర్ లోకసభ నియోజకవర్గంలో భాగంగా ఉన్నది. మండలంలో 39 రెవెన్యూ గ్రామాలు, 29 గ్రామపంచాయతీలున్నాయి. తంగెడపల్లి మంగలి చెరువు మండలంలో పెద్ద చెరువు. షాద్ నగర్-కంది, షాద్ నగర్ -పరిగి రహదారులు మండలం నుంచి వెళ్ళుచున్నవి. ప్రముఖ కవి చెన్నమరాజు కొండలరావు ఈ మండలమునకు చెందినవారు. 2011 లెక్కల ప్రకారం మండల జనాభా 60550.
అక్టోబరు 11, 2016 నాటి జిల్లాల పునర్వ్యవస్థీకరణ సందర్భంగా ఈ మండలం మహబూబ్‌నగర్ జిల్లా నుంచి రంగారెడ్డి జిల్లాలోకి చేరింది. మండల సరిహద్దులు: ఈ మండలం రంగారెడ్డి జిల్లాలో పశ్చిమ భాగంలో వికారాబాదు జిల్లా మరియు మహబూబ్‌నగర్ జిల్లాల సరిహద్దులో ఉంది. మండలానికి తూర్పున షాబాద్ మండలం మరియు ఫరూఖ్‌నగర్ మండలం, పశ్చిమాన చౌదరిగూడెం మండలం, దక్షిణాన మహబూబ్‌నగర్ జిల్లా, వాయువ్యాన వికారాబాదు జిల్లా సరిహద్దులుగా ఉన్నాయి.
జనాభా:
2001 లెక్కల ప్రకారం మండల జనాభా 54899. ఇందులో పురుషులు 27793, మహిళలు 27106. 2011 లెక్కల ప్రకారం మండల జనాభా 60550. ఇందులో పురుషులు 30685, మహిళలు 29865. జనాభాలో ఇది జిల్లాలో 26వ స్థానంలో ఉంది. రవాణా సౌకర్యాలు: 44వ నెంబరు జాతీయ రహదారిపై ఉన్న షాద్ నగర్ నుంచి హైదరాబాదు-బీజాపూ అంతర్రాష్ట్ర రహదారిని కలిపే షాద్ నగర్-పరిగి రహదారి మరియు రెండు జాతీయరహదారులను కలిపే షాద్ నగర్ -కంది రహదారి మండలం నుంచి వెళ్ళుచున్నవి.
చరిత్రలో కొనదుర్గంగా పిలువబడిన కొందుర్గ్‌ను బాదామి చాళుక్యులు, కాకతీయులు, బహమనీలు, నిజాంలు పాలించారు. కాకతీయుల కాలంలో ఇక్కడ యుద్ధసామాగ్రి తయారుచేసేవారని గ్రామస్థుల కథనం. గ్రామంలో జిల్లేడు సంస్థానానికి చెందిన కోట ముఖద్వారం, కోట బురుజులు ఉన్నాయి. రాజకీయాలు: ఈ మండలము షాద్ నగర్ అసెంబ్లీ నియోజకవర్గం, మహబూబ్‌నగర్ లోకసభ నియోజకవర్గంలో భాగంగా ఉన్నది. 2001 జడ్పీటీసి ఎన్నికలలో తెలుగుదేశం పార్టీకి చెందిన సుధాకర్ రావు, 2006 జడ్పీటీసి ఎన్నికలలో తెలుగుదేశం పార్టీకి చెందిన దామోదర్ రెడ్డి విజయం సాధించారు. 2014లో ఎంపీపీగా కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎ.గాయత్రి ఎన్నికయ్యారు.
2008-09 నాటికి మండలంలో 51 ప్రాథమిక పాఠశాలలు (అన్నీ మండల పరిషత్తు), 17 ప్రాథమికోన్నత పాఠశాలలు (16 మండల పరిషత్తు, 1 ప్రైవేట్), 8 ఉన్నత పాఠశాలలు (1 ప్రభుత్వ, 6 జడ్పీ, 1 ప్రైవేట్), ఒక ప్రైవేట్ జూనియర్ కళాశాల ఉన్నది. వ్యవసాయం, నీటిపారుదల: మండలం మొత్తం విస్తీర్ణం 23313 హెక్టార్లలో 51% భూమి వ్యవసాయ యోగ్యంగా ఉన్నది. మండలంలో పండించే ప్రధాన పంటలు మొక్కజొన్న. వరి. కందులు, జొన్నలు, ప్రత్తి కూడా పండిస్తారు. మండల సాధారణ వర్షపాతం 639 మిమీ. మండలంలో సుమారు 2700 హెక్టార్లకు నీటిపారుదల సౌకర్యం ఉంది.
= = = = =
సంప్రదించిన పుస్తకాలు, వెబ్‌సైట్లు:
|
Tags:Kondurg Mandal in Telugu, Rangareddy Dist mandals information in Telugu,
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి