22, జనవరి 2013, మంగళవారం

గద్వాల మండలము (Gadwal Mandal)

జిల్లా జోగులాంబ గద్వాల జిల్లా
రెవెన్యూ డివిజన్ గద్వాల
జనాభా1,14,748
అసెంబ్లీ నియోజకవర్గంగద్వాల
లోకసభ నియోజకవర్గంనాగర్‌కర్నూల్
పర్యాటక ప్రాంతాలుగద్వాల కోట, జమ్ములమ్మ దేవాలయం,
ముఖ్య పంటలువరి,
మండల ప్రముఖులుపాగపుల్లారెడ్డి, డి.కె.సమరసింహారెడ్డి, డి.కె.అరుణ,
గద్వాల జోగులాంబ గద్వాల జిల్లాకు చెందిన ఒక మండలము. గద్వాల చేనేత చీరలకు ప్రసిద్ధి చెందింది మరియు ఇది ఒక చరిత్రాత్మకమైన స్థలం కూడా. గద్వాల పట్టణం నడిబొడ్డున సంస్థానాధీశుల కాలం నాటి పూర్తిగా మట్టితో నిర్మించిన కోట కలదు. గద్వాల సమీపంలో ఆత్మకూరు వెళ్ళు రహదారిలో ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు ఉంది. 44వ నెంబరు జాతీయ రహదారి నుండి 18 కిలోమీటర్లు లోపలికి ఉన్న గద్వాల పట్టణానికి రైలు మార్గం ఉంది. దాదాపు 600 సంవత్సరాల చరిత్ర కలిగిన గద్వాల సంస్థానం చరిత్ర పట్టణానికి ఉంది. గద్వాల సమీపంలోని పలు గ్రామాలు కూడా చారిత్రక ప్రాశస్త్యం కలవి. గద్వాల మండలములోని పూడూరును రాజధానిగా చేసుకొని పాలించిన చరిత్ర ఉంది. అయిజా, రాజోలి, వేణిసోంపూర్, ఆలంపూర్ తదితర గ్రామాలు కూడా చారిత్రకంగా, పర్యాటకంగా ప్రఖ్యాతిగాంచినవి. ఇది గద్వాల అసెంబ్లీ నియోజకవర్గానికి కేంద్రంగా ఉంది. కళలకు నిలయంగా బాలభవన్ విరాజిల్లుతోంది. దీనిని 1982లో ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు, మాజీ శాసనసభ్యుడైన పాగ పుల్లారెడ్డి ఏర్పాటుచేశాడు. వందేమాతరం రామచంద్రారావు, వీరభద్రారావు, పాగపుల్లారెడ్డి, లడ్డుభీమన్న లాంటి ప్రముఖ స్వాతంత్ర్యసమరయోధులు పట్టణానికి చెందినవారే. రాజకీయంగా కూడా గద్వాల ప్రముఖస్థానం పొందింది. గతంలో రాష్ట్ర మంత్రిపదవి నిర్వహించిన సమరసింహారెడ్డి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా పనిచేసిన డి.కె.అరుణ గద్వాల పట్టణమునకు చెందినవారు.

పట్టణ స్వరూపం, జనాభా
రెవెన్యూ డివిజన్ కేంద్రమైన గద్వాల పట్టణం డివిజన్‌ లోనే అతిపెద్దది మరియు మహబూబ్ నగర్ జిల్లాలో ప్రముఖ పట్టణాలలో ఒకటి. ఇది 16°14′ ఉత్తర అక్షాంశం, 77°48′ తూర్పు రేఖాంశంపై ఉన్నది. .
2001 లెక్కల ప్రకారం గద్వాల మండల జనాభా 96375. ఇందులో పురుషులు 49187 మరియు స్త్రీలు 47188. జనసాంద్రత ప్రతి చ.కి.మీ.కు 355. అక్షరాస్యుల సంఖ్య 40806. ఎస్సీలు 11467, ఎస్టీలు 842. 
2011 జనాభా లెక్కల ప్రకారం మండల జనాభా 114748. ఇందులో పురుషులు 57853, మహిళలు 56895. పట్టణ జనాభా 63489.

మండల సరిహద్దులు:
ఈ మండలమునకు ఉత్తరము మరియు ఈశాన్యమున కృష్ణానది దానికి ఆవల ఆత్మకూరు మండలము, ఆగ్నేయాన ఇటిక్యాల మండలము, దక్షిణమున ఇటిక్యాల మరియు మల్డకల్ మండలములు,పశ్చిమాన ధరూర్ మండలము సరిహద్దులుగా ఉన్నాయి. 
 
చరిత్ర:
ఈ ప్రాంతం 17వ శతాబ్ది నుంచి గద్వాల సంస్థానంలో భాగంగా ఉండేది. సెప్టెంబరు 17, 1948న హైదరాబాదు విమోచనోద్యమంతో నిజాం రాజ్యంతో పాటు అందులోని సంస్థానాలు కూడా భారత యూనియన్‌లో భాగం కావడంతో ఈ ప్రాంతం కూడా హైదరాబాదు రాష్ట్రంలో భాగంగా 1956 వరకు కొనసాగింది. 1956-2014 కాలంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కొనసాగింది. 1969 తెలంగాణ ఉద్యమం సమయంలో గద్వాల మండలం చెనుగోనుపల్లికి చెందిన పాశం సర్వారెడ్డి ఉస్మానియా విశ్వవిద్యాలయ రైల్వేస్టేషన్ దహనం సమయంలో మరణించడం, ఆయన శవయాత్ర సమయంలో గద్వాలలో ఉద్యమపోరు తీవ్రం కావడం జరిగింది. 2009-14 కాలంలో కూడా మలిదశ తెలంగాణ ఉద్యమంలోనూ ఈ మండలంలో ఉద్యమం ఉధృతంగా సాగింది. 42 రోజులపాటు సకలజనుల సమ్మె కొనసాగింది. విద్యార్థులు, ఉద్యోగులు, వ్యాపారస్తులు, మహిళలు, న్యాయవాదులు తదితరులతో తెలంగాణ ఉద్యమపోరు హోరెత్తింది. జూన్ 2, 2014న తెలంగాణ ప్రాంతంతో పాటు ఈ మండలం కూడా తెలంగాణ రాష్ట్రంలో భాగంగా మారింది. అక్టోబరు 11, 2016న జిల్లాల పునర్విభజన సమయంలో మహబూబ్‌నగర్ జిల్లా నుంచి కొత్తగా ఏర్పడిన జోగులాంబ గద్వాల జిల్లాలో చేరింది.

(గద్వాల రైల్వేస్టేషన్)
రవాణా
రైలు సౌకర్యం
గద్వాల రైల్వే స్టేషన్ దక్షిణ మధ్య రైల్వే జోన్‌లో హైదరాబాదు - కర్నూలు మద్య హైదరాబాదు నుంచి దక్షిణముగా 175 కిలోమీటర్ల దూరంలో ఉంది. మహబూబ్ నగర్ నుంచి 75 కిలోమీటర్ల దూరంలో మరియు కర్నూలు నుంచి 56 కిలోమీటర్ల దూరంలో ఉంది. మహబూబ్ నగర్ వైపు వెళ్ళడానికి రోడ్డు మార్గములో దూరం అధికంగా ఉన్నందున రైలు ప్రయాణం చాలా అనువుగా ఉన్నది. ఇక్కడి నుంచి కర్ణాటక లోని రాయచూరుకు నూతనంగా రైలుమార్గపు నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ఇది పూర్తయిన తరువాత వ్యాపారపరంగా గద్వాల పట్టణం మరింత అభివృద్ధి చెందే అవకాశం ఉంది.

గద్వాల నియోజకవర్గంలో
గద్వాల స్థానం (ఆకుపచ్చ రంగు)
రోడ్డు రవాణా
గద్వాల పట్టణం 44వ నెంబరు జాతీయ రహదారికి 18 కిలోమీటర్ల దూరంలో ఉంది. హైదరాబాదు - కర్నూలు మార్గంలో జాతీయ రహదారిపై కృష్ణా నది వంతెన దాటిన కొద్దిదూరంలో ఉన్న ఎర్రవల్లి కూడలి నుంచి కుడివైపున వెళ్ళవలసి ఉంటుంది. కృష్ణానదిపై మరో వంతెన లేనందున వంతెన దాటి గద్వాల వెళ్ళడం హైదరాబాదు, మహబూబ్ నగర్ నుంచి వచ్చు వాహనాలకు దూరం అధికం అవుతుంది. గద్వాల నుంచి కర్నూలు, అయిజా, ఆత్మకూరు మరియు కర్ణాటకలోని రాయచూరు పట్టణాలకు బస్సు సౌకర్యాలు బాగుగా ఉన్నాయి. గద్వాలలో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ డీపో కూడా కలదు. ఇది మహబూబ్ నగర్ జిల్లాలోని 8 డీపోలలో ఒకటి. పరిసర ప్రాంతాలలోని బస్సుస్టేషన్ల నిర్వహణ ఈ డీపో ద్వారానే జరుగుతుంది.

రాజకీయాలు:
ఈ మండలము గద్వాల అసెంబ్లీ నియోజకవర్గం, నాగర్‌కర్నూల్ లోకసభ నియోజకవర్గంలో భాగముగా ఉన్నది. పాగపుల్లారెడ్డి, డి.కె.సమరసింహారెడ్డి, డి.కె.భరతసింహారెడ్డి, డి.కె.అరుణ వంటి రాజకీయ నేతలు ఈ ప్రాంతానికి చెందినవారు. 2006 జడ్పీటీసి ఎన్నికలలో తెలుగుదేశం పార్టీకి చెందిన బి.కృష్ణమోహన్ రెడ్డి విజయం సాధించారు. 2018లో కృష్ణమోహన్ రెడ్డి గద్వాల ఎమ్మెల్యేగా ఎన్నికైనారు.

విద్యాసంస్థలు:
2008-09 నాటికి మండలంలో 59 ప్రాథమిక పాఠశాలలు (14 ప్రభుత్వ, 25 మండల పరిషత్తు, 1 ప్రైవేట్ ఎయిడెడ్, 19 ప్రైవేట్ అన్-ఎయిడెడ్), 21 ప్రాథమికోన్నత పాఠశాలలు (1 ప్రభుత్వ, 14 మండల పరిషత్తు, 6 ప్రైవేట్ అన్-ఎయిడెడ్), 28 ఉన్నత పాఠశాలలు (6 ప్రభుత్వ, 2 జడ్పీ, 1 ప్రైవేట్ ఎయిడెడ్, 19 ప్రైవేట్ అన్-ఎయిడెడ్), 6 జూనియర్ కళాశాలలు (1 ప్రభుత్వ, 5 ప్రైవేట్) ఉన్నవి.

వ్యవసాయం, నీటిపారుదల:
మండలం మొత్తం విస్తీర్ణం 26510 హెక్టార్లలో 45% భూమి వ్యవసాయ యోగ్యంగా ఉన్నది. మండలంలో పండించే ప్రధాన పంట వరి. వేరుశనగ, కందులు కూడా పండిస్తారు. మండల సాధారణ వర్షపాతం 642 మిమీ. మండలంలో సుమారు 5800 హెక్టార్లకు నీటిపారుదల సౌకర్యం ఉంది. 

సంఘటనలు
  • 2016, అక్టోబరు 11: జిల్లాల పునర్వ్యవస్థీకరణలో జోగులాంబ గద్వాల ప్రత్యేఖ జిల్లాగా ఏర్పాటైంది. మండల కేంద్రం జిల్లా కేంద్రంగా మారింది. 
  • 2014, జూన్ 2: మండలం ఆంధ్రప్రదేశ్ నుంచి కొత్తగా ఏర్పాటైన తెలంగాణ రాష్ట్రంలో భాగమైంది.
  • 2013, అక్టోబరు 12: నూతనంగా నిర్మించిన గద్వాల- రాయచూర్ రైలుమార్గం ప్రారంభమైంది. 
  • 2013, జూలై 6: డి.కె.సమర సింహారెడ్డి తెలుగుదేశం పార్టీలో చేరారు.
  • 2013, జూన్ 22: గద్వాలలో 2011 సం.పు టీవి నందుల ప్రధానోత్సవం జరిగింది.
  • 2010,  అక్టోబరు 20: ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు, గద్వాల అసెంబ్లీ నియోజకవర్గం తొలి శాసనసభ్యుడు, పురపాలక సంఘం చైర్మెన్‌గా, మార్కెట్ కమిటీ చైర్మెన్‌గా పనిచేసిన పాగపుల్లారెడ్డి మరణం.
  • 2010, జూన్ 14: మహారాజ కూరగాయల మార్కెట్‌లో పాత దుకాణాలు కూలి 10 మంది మరణించారు.
  • 2009, ఫిబ్రవరి: గద్వాల పురపాలక సంఘం మూడవ గ్రేడు నుంచి రెండవ గ్రేడుకు మార్చబడింది.
  • 2009, సెప్టెంబరు 1: గద్వాల రాజవంశీయుడు సోమనాద్రి భూపాల్ మరణించారు.
  • 2006 ఫిబ్రవరి: రాష్ట్రస్థాయి బాలల రంగస్థల ఉత్సవాలు నిర్వహించబడ్డాయి.
  • 1952: పురపాలక సంఘము ఏర్పాటుచేయబడింది.

ఇవి కూడా చూడండి;

 


హోం,
విభాగాలు:
జోగులాంబ గద్వాల జిల్లా మండలాలు,    గద్వాల మండలము, గద్వాల రెవెన్యూ డివిజన్, గద్వాల అసెంబ్లీ నియోజకవర్గం,  


= = = = =
సంప్రదించిన పుస్తకాలు, వెబ్‌సైట్లు:
  • Handbook of Statistics, Mahabubnagar Dist, 2008,
  • Handbook of Census Statistics, Mahabubnagar Dist, 2001,
  • Census of India 2011, Provistional Population Totals, Part 2, Volume 2 of 2011.
  • మహబూబ్‌నగర్ జిల్లా సర్వస్వము (రచన- బి.ఎన్.శాస్త్రి), 
  • తెలంగాణం (1969 తెలంగాణ ఉద్యమ శంఖారావం),
  • బ్లాగు రచయిత సందర్శించి తెలుసుకున్న, సేకరించిన సమాచారం,

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక