భౌగోళిక స్వరూపం:
తెలంగాణ రాష్ట్రం దక్కను పీఠభూమిలో భాగంగా, తూర్పు కనుమలకు పశ్చిమంగా ఉన్నది. ఈ ప్రాంతము సరాసరిన సముద్రమట్టం నుంచి 1500 అడుగుల ఎత్తును కలిగియుండి తూర్పు వైపునకు వాలి ఉంది. తెలంగాణాలో దక్షిణ భాగంలో ప్రధానముగా కృష్ణా, తుంగభద్ర నదులు ప్రవహిస్తుండగా, ఉత్తర భాగంలో గోదావరి నది ప్రవహిస్తున్నది. కృష్ణా, తుంగభద్ర నదులు దక్షిణమున ప్రవహిస్తున్నాయి. రాష్ట్ర విస్తీర్ణం 1,14,840 చదరపు కిలోమీటర్లు. భౌగోళికంగా నల్గొండ జిల్లా పెద్దది కాగా, హైదరాబాదు చిన్నది. ఈ ప్రాంతానికి సముద్రతీరం లేదు. రాష్ట్రం మొత్తంగా చూస్తే కృష్ణానది పరీవాహకప్రాంతంలో 69%, గోదావరి నది పరీవాహకప్రాంతంలో 79% ఈ ప్రాంతంలోనే ఉంది. తెలంగాణ జిల్లాలు: అవతరణ నాటికి తెలంగాణ రాష్ట్రంలో 10 జిల్లాలు ఉండగా 2016లో జిల్లాల పునర్వ్యవస్థీకరణ ప్రకారం 21 జిల్లాలు కొత్తగా ఏర్పడ్డాయి. 2019 లో మరో 2 జిల్లాలు ఏర్పాటుచేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో 33 జిలాలు కలవు. (33 జిల్లాల వ్యాసాలు చూడండి) నదులు: గోదావరి, కృష్ణా నదులతో సహా పలు నదులు తెలంగాణ రాష్ట్రంలో ప్రవహిస్తున్నాయి. గోదావరి నది ఉమ్మడి ఆదిలాబాదు, నిజామాబాదు, కరీంనగర్, వరంగల్, ఖమ్మం జిల్లాల సరిహద్దుల గుండా ప్రవహిస్తుంది. కృష్ణా నది ఉమ్మడి మహబూబ్‌నగర్, నల్గొండ జిల్లాల దక్షిణ భాగం నుంచి ప్రవహిస్తుంది. తుంగభద్రనది మహబూబ్‌నగర్ జిల్లా దక్షిణ సరిహద్దు గుండా ప్రవహిస్తూ కృష్ణానదిలో సంగమిస్తుంది. భీమానది నారాయణపేట జిల్లాలో కొంత దూరం ప్రవహించి కృష్ణాలో సంగమిస్తుంది. దుందుభి నది నాగర్‌కర్నూల్ మరియు నల్గొండ జిల్లాలలో ప్రవహించి కృష్ణానదిలో కలుస్తుంది. ప్రాణహిత నది కొమురంభీం, మంచిర్యాల జిల్లాల సరిహద్దు గుండా ప్రవహించి గోదావరిలో సంగమిస్తుంది. మూసీనది వికారాబాదు, రంగారెడ్డి, హైదరాబాదు, నల్గొండ జిల్లాలలో ప్రవహించి కృష్ణానదిలో కలుస్తుంది. పాలేరునది ఉమ్మడి నల్గొండ, ఖమ్మం జిల్లాల సరిహద్దు గుండా ప్రవహించి కృష్ణాలో విలీనమౌతుంది. కాగ్నానది వికారాబాదు జిల్లాలో పశ్చిమం దిశగా ప్రవహించి కర్ణాటకలో కృష్ణాలో సంగమిస్తుంది. మంజీరనది ఉమ్మడి మెదక్, నిజామాబాదు జిల్లాలలో ప్రవహించి గోదావరిలో కలుస్తుంది. చరిత్ర పురాతన రాతియుగం నుంచే తెలంగాణ రాష్ట్రం ఉనికిని కలిగియుంది. పూర్వ రాతియుగం కాలం నాటి ఆవాసస్థలాలు వేములపల్లి, ఏటూరి నాగారం, బాసర, బోథ్, హాలియా, క్యాతూర్ తదితర ప్రాంతాలలో బయటపడ్డాయి. వాడపల్లి, వెల్టూరు, పోచంపాడు, ఎల్లారెడ్డిపేట తదితర ప్రాంతాలలొ బృహచ్ఛిలాయుగం నాటి ఆనవాళ్ళను పురావస్తు శాస్త్రవేత్తలు సేకరించారు. షోడస మహాజనపదాల కాలంలో దక్షిణాదిలోని ఏకైక జనపదం ఆశ్మక రాజ్యం ఈ రాష్ట్రం లోనిదే. పోదన్ (నేటి బోధన్) దీని రాజధానిగా ఉండింది. బౌద్ధ గ్రంథాలలో కూడా ఈ సమాచారం నిక్షిప్తమైయుంది. బుద్ధుడి కాలంలో సుజాతుడు బోధన్ పాలకుడిగా ఉన్నట్లు బౌద్ధ వాజ్ఞయం తెలియజేస్తుంది. బుద్ధి సమకాలికుడు బావరి స్థిరపడ్డ ప్రాంతం నేడు బావనకుర్తి (ఆదిలాబాదు జిల్లాలో నదీస్వీపం) గా పిలుబడుతున్నది. ప్రతిష్టానపురం (పైఠాన్) రాజధానిగా పాలించిన ములక రాజ్యం గోదావరి నది సరిహద్దు వరకు ఉండగా అందులో ఉమ్మడి ఆదిలాబాదు జిల్లా ప్రాంతం భాగంగా ఉండింది. అప్పుడు ఉత్తర-దక్షిణ ప్రధానమార్గం ఈ రాజ్యం గుండా ఉండేది. విదేశాలలో ఉండే బౌద్దులు ఆంధ్రులు (నేటి తెలంగాణ రాష్ట్రం ఉండేవారిని) మంజీరకమని పిలిచారు (నేటి మంజీర నది పరీవాహక ప్రాంతం). షోడస మహాజనపదాలలో మగధ రాజ్యం బలపడి చాలా రాజ్యాల్ని ఆక్రమించగా అప్పుడు అశ్మక రాజ్యం కూడా మగధలో విలీనమైంది. ఆ తర్వాత నందరాజులు, ఆ పిదప మౌర్యులు ఈ ప్రాంతాన్ని పాలించారు. మౌర్యుల కాలం: మౌర్యుల కాలంలో ఈ ప్రాంతం భాగంగా ఉండేదనడానికి అశోకుని 13వ శిలాశాసనం ఆధారంగా చరిత్రకారులు నిర్ణయించారు. మౌర్యుల కాలంలో పర్యటించిన విదేశీ యాత్రికుడు మెగస్తనీసు ఆంధ్రులకు 30 దుర్గాలున్నాయని పేర్కొనగా అందులో కదంబపూర్ (కరీంనగర్), పౌదన్యపురం (బోధన్), పిధుండ, ముషిక, ధూళికట్ట, పెదబొంకూరు, ఫణిగిరి, కొండాపురం కోటిలింగాల, గాజులబండ ముఖ్యమైనది. ఇవన్నీ నేటి తెలంగాణ రాష్ట్రం లోనివే. ఇంకనూ బయటపడాల్సిన ప్రాంతాలు ఎన్నో ఉన్నాయి. శాతవాహనుల కాలం: శాతవాహనుల కాలంలో కోటిలింగాల ఒక వెలుగు వెలిగిన ప్రాంతం. శాతవాహనుల తొలి రాజధాని కూడా ఇదే. అయితే కొన్ని దశాబ్దాల వరకు కూడా ప్రతిష్టానపురం మరియు ధరణికోటనే తొలి రాజధానిగా పరిగణించారు. శాతవాహనులకు సంబంధించిన పలు నాణేలు కోటిలింగాల మరియు పరిసరాలలో లభ్యమయ్యాయి. కాబట్టి శాతవాహనుల తొలి కేంద్రస్థానం గోదావరి తీరంలోని తెలంగాణ ప్రాంతమేనని పరిశోధకులు నిర్ణయించారు. శాతవాహనుల అనంతరం తెలంగాణ ప్రాంతం మొత్తం కలిపి పాలించిన రాజ్యాలులేవు. విజయపురు కేంద్రంగా పాలించిన ఇక్ష్వాకుల రాజ్యంలో తెలంగాణ తూర్పు ప్రాంతాలు భాగంగా ఉండేవి. ఇదే కాలంలో ఉత్తర తెలంగాణ ప్రాంతాన్ని వాకాటకులు పాలించారు. వాకాటక రాజు ప్రవరసేనుడి కాలంలో మొత్తం తెలంగాణ ప్రాంతం వాకాటక రాజ్యంలో కలిసిపోయింది. ఇక్ష్వాకులకు సామంతులుగా ఉన్న విష్ణుకుండీనులు కూడా ఇక్ష్వాకుల తర్వాత స్వతంత్ర్యంగా ఏర్పడి రాజ్యపాలన చేశారు. ఈ విష్ణుకుండినుల జన్మభూమి తెలంగాణయేనని ప్రసిద్ధ చరిత్రకారుడు బి.ఎన్.శాస్త్రి పరిశోధనల ద్వారా నిరూపించాడు. ఆలంపూర్‌లో బాదామి చాళుక్యుల నిర్మించిన దేవాలయాలు బాదామి చాళుక్య కాలం: బాదామి చాళుక్యుల కాలంలో తెలంగాణ మొత్తం వీరి పాలనలోఉండేది. అష్టాదశ శక్తిపీఠాలలో ఒకటైన ఆలంపూర్ ఆలయాలు ఈ కాలంలోనే నిర్మించబడ్డాయి. ఆలంపూర్‌లో పదుల సంఖ్యలో వీరి రాతిశాసనాలు ఉన్నాయి. మొదటి పులకేశి యొక్క శాసనం నల్గొండ జిల్లా ఏలేశ్వరంలోలభ్యమైంది. భవభూతి ఈ కాలం నాటి ప్రముఖ తెలంగాణ కవి. రాష్ట్రకూటుల కాలం: రెండో కీర్తివర్మతో చాళుక్యవంశం అంతంకాగా మాన్యఖేతం రాజధానిగా రాష్ట్రకూటులు పాలన సాగించారు. దంతిదుర్గుని కాలంలో తెలంగాణ మొత్తం రాష్ట్రకూటుల పాలనలో ఉండేది. తెలంగాణలో తొలి గద్యశాసనం "కొరివి శాసనం" ఈ కాలం నాటిదే. రాష్ట్రకూటుల సామంతులుగా ఉన్న వేములవాడ చాళుక్యులు బోధన్, వేములవాడలలో స్వతంత్ర్య పాలన చేశారు. కళ్యాణి చాళుక్యకాలం: రాష్ట్రకూట రాజు రెండోకర్కరాజును ఓడించి రెండో తైలపుడు కళ్యాణి చాళుక్యరాజ్యం స్థాపించాడు. ప్రముఖ కవి రన్నడు ఇతని ఆస్థాన కవి. మహబూబ్‌నగర్ జిల్లా గంగాపురంలోని చెన్నకేశవస్వామి ఆలయాన్ని ఈ కాలంలోనే నిర్మించబడింది. ఈ ప్రాంతంలోవీరి పలు శాసనాలున్నాయి. ఇదే కాలంలో ఖమ్మం ప్రాంతంలో ముదిగొండ చాళుక్యులు పాలించారు. పాలమూరు జిల్లా మద్యభాగంలో కందూరి చోడుల పాలన కిందకు ఉండేది. కందూరి చోడులు: క్రమక్రమంగా కందూరు చోళరాజ్యం విస్తరించింది. తొలి కాకతీయుల కాలం నాటికి ఇది కాకతీయ రాజ్యం కంటే పెద్ద రాజ్యంగా విలసిల్లింది. కందూరు, మగతల (నేటి మక్తల్), వర్థమానపురం (నేటి నంది వడ్డెమాన్), గంగాపురం, అమరాబాద్, భువనగిరి, వాడపల్లి, కొలనుపాక ఈ కాలంలో పెద్ద పట్టణాలుగా విలసిల్లాయి. విక్రమాదిత్యుని కుమారుడు తైలపుని కాలంలో రాజ్యాన్ని రెండుగా చేసి ఇద్దరు కుమారులను రాజులుగా చేశాడు. దానితో ఇప్పటి నల్గొండ, పాలమూరు జిల్లా ప్రాంతాలలోవేర్వేరు పాలన సాగింది. గోకర్ణుడు తన రాజధానిని పానగల్లు నుంచి వర్థమాన పురానికి తరలించాడు. కందూరు చోడూల శాసనం ఒకటి మామిళ్ళపల్లిలో కూడా లభ్యమైంది. ఇదే కాలంలో వరంగల్ ప్రాంతంలో పొలవాస పాలకులు రాజ్యం చేశారు. అనుమకొండ (నేటి హన్మకొండ ప్రాంతం మాత్రం కొలనుపాక రాజధానిగా కళ్యాణి చాళుక్యులే పాలించారు. కాకతీయ కాలం: తొలి కాకతీయుల కాలంలో కాకతీయ సామ్రాజ్యం ఉత్తర తెలంగాణకే పరిమితమై ఉండగా రుద్రదేవుని కందూరు చోడరాజ్యంపై దండెత్తి వర్థమానపురాన్ని నాశనం చేసి తన సామంతులను పీఠం అధిష్టింపచేశాడు. తెలుగులో తొలి రామాయణం రంగనాథ రామాయణం రచించిన గోనబుద్ధారెడ్డి ఈ కాలం వాడే. ఈయన సోదరి కుప్పాంబిక తొలి తెలుగు కవియిత్రిగా ఖ్యాతిచెందింది. క్రీ.శ.1323లో ఢిల్లీ సుల్తానుల దాడితో కాకతీయ సామ్రాజ్యం అంతంకాగా తెలంగాణ ప్రాంతం సుల్తానుల వశమైంది. అయితే కొంతకాలానికే ప్రతాపరుద్రుని సేనానిగా పనిచేసిన రేచర్ల సింగమ నాయకుడు స్వతంత్రించి పద్మనాయక రాజ్యాన్ని స్థాపించాడు. ఇది దక్షిణ తెలంగాణ ప్రాంతంలో పాలన సాగించగా, ముసునూరి పాలకులు ఈశాన్య తెలంగాణలో కొంతవరకు పాలించారు. ఆ తర్వాత కృష్ణానదికి దక్షిణభాగం ఉన్న తెలంగాణ ప్రాంతం విజయనగర సామ్రాజ్యంలో భాగమైంది. ఉత్తర భాగం మాత్రం గోల్కొండ సుల్తానుల అధీనంలో ఉండేది. కుతుబ్‌షాహీల కాలం: క్రీ.శ.1565లో విజయనగర సామ్రాజ్యం అంతం కాగా, దక్షిణ తెలంగాణ ప్రాంతం కుతుబ్‌షాహీల పాలనలోకి వచ్చింది. ఉత్తర ప్రాంతంలో అంతకు క్రితమే బహమనీలు పాలించారు. బహమనీ సామ్రాజ్యం ఐదు ముక్కలు అయిన పిదప గోల్కొండ ప్రాంతాన్ని కుతుబ్‌షాహీలు రాజ్యమేలారు. కుతుబ్‌షాహీల ఉచ్ఛదశలో కూడా కృష్ణానదికి దక్షిణాన ఉన్న తెలంగాణ ప్రాంతం (రాయచూర్ డోబ్‌లోని నడిగడ్డ ప్రాంతం) ఆదిల్‌షాహీల పాలన కిందకు ఉండేది. అయితే ఇది తరచుగా చేతులు మారింది. 1687లో ఈ ప్రాంతం మొఘలుల వశమైంది. ఆసఫ్‌జాహీల కాలం: క్రీ.శ.1724 నుంచి తెలంగాణ ప్రాంతాన్ని ఆసఫ్‌జాహీలు పాలించారు. రాజభాషగా పర్షియన్ స్థానంలో ఉర్దూ ప్రవేశపెట్టారు. స్థానిక ప్రజలను అణకద్రొక్కి ఢిల్లీనుంచి ఉద్యోగస్తులను రప్పించడంతో ముల్కీ ఉద్యమం తలెత్తింది. క్రమక్రమంగా ప్రజలలో తలెత్తిన స్వేచ్ఛా భావనలతో 20వ శతాబ్ది ప్రారంభం నుంచి పలు రచయితల మూలంగా ప్రజలలో చైతన్యం వచ్చింది. సురవరం ప్రతాపరెడ్డి 1925లో గోల్కొండ పత్రికను స్థాపించడం, 1930 నుంచి నిజాం రాష్ట్ర ఆంధ్రమహాసభలు జరగడంతో ప్రజలలో చైతన్యం అధికమైంది. సురవరంతో పాటు బూర్గుల రామకృష్ణారావు, పులిజాల వెంకటరావు, కొండావెంకట రంగారెడ్డి, మాడపాటి హన్మంతరావు, మందుముల నరసింగరావు, రావి నారాయణరెడ్డి, జమలాపురం కేశవరావు తదితరులు ఉద్యమాన్ని ఉధృతం చేశారు. తెలంగాణ విమోచనోద్యమం: 1947, ఆగస్టు 15న భారత దేశానికి స్వాతంత్ర్యం వచ్చినను తెలంగాణ ప్రాంతం నిజాం పరిపాలనలోని హైదరాబాదు సంస్థానంలో భాగంగా ఉండేది. తరువాత పోలీసు చర్య ద్వారా 1948, సెప్టెంబరు 17ఇది భారతదేశంలో కలపబడినది, ఈ పోరాటంలో తెలంగాణ విమోచనోద్యమం, తెలంగాణా సాయుధ పోరాటంనాటి రజాకార్ల దౌర్జన్యాలకు వ్యతిరేకంగా ముఖ్య భూమిక పోషించినది. 1948 నుంచి హైదరాబాదు రాష్ట్రంగా కొనసాగించి. వెల్లోడి మరియు బూర్గుల రామకృష్ణారావు ఈ కాలంలో ముఖ్యమంత్రులుగావ్యవహరించారు. 1956 తర్వాత: 1956లో భాషా ప్రాతిపదికపై రాష్ట్రాల పునర్విభజన జరుగగా హైదరాబాదు రాష్ట్రంలోని తెలుగు మాట్లాడే ప్రాంతాలు మరియు ఆంధ్రరాష్ట్రం కలిసి ఆంధ్రప్రదేశ్‌గా ఏర్పడింది. వరంగల్లు నుండి కొంత ప్రాంతాన్నీ, గోదావరి జిల్లాలనుండి భద్రాచలం , దండకారణ్యం ప్రాంతాలకు వేరు చేసి ఖమ్మం రాజధానిగా ఖమ్మం జిల్లాను ఏర్పరచినారు. ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన కొన్నాళ్ళకే మళ్ళీ వేర్పాటు ఉద్యమాలు తలెత్తాయి. 1969లో మర్రి చెన్నారెడ్డి నేతృత్వంలో ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమం ఉధృతరూపం దాల్చింది. అప్పుడు ప్రత్యేక తెలంగాణ నేపథ్యంలో ఏర్పడిన తెలంగాణ ప్రజా సమితి పార్టీ 1971లో 11 లోకసభ స్థానలలో విజయం సాధించింది. 1979లో హైదరాబాదు జిల్లా గ్రామీణ ప్రాంతాన్ని వేరుచేసి రంగారెడ్డి జిల్లా ఏర్పాటుచేశారు. 2001, ఏప్రిల్ 27న కె.చంద్రశేఖర్ రావు ప్రత్యేక తెలంగాణ లక్ష్యంగా తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీని ఏర్పాటు చేశారు. 2011 నుంచి తెలంగాణ ఉద్యమ నాయకత్వం "ఐక్య కార్యాచరణ సమితి" చేతుల్లోకి వెళ్ళడంతో విద్యార్థులు, ఉద్యోగసంఘాలు చురుకుగా పాల్గొన్నారు. తెలంగాణ అంతటా ఉద్యోగులు, కార్మికులు 2011లో 42 రోజుల సమ్మె చేశారు. 2010లో తెలంగాణ అంశంపై శ్రీకృష్ణ కమిటిని నియమించగా ఆ కమిటి 6 ప్రతిపాదనలు చేసింది. 2013, జూలై 30న ప్రత్యేక తెలంగాణకై కాంగ్రెస్ వర్కింగ్ కమిటి తీర్మానం చేయగా, 2013 అక్టోబరు 3న కేంద్ర మంత్రిమండలి ఆమోదించింది. జూన్ 2, 2014 నాడు భారతదేశంలో 29వ రాష్ట్రంగా అవతరించింది. తెలంగాణ పర్యాటక ప్రదేశాలు;
ఆదిలాబాదు జిల్లాలో ఎత్తయిన కుంటాల జలపాతం, పొచ్చెర జలపాతం, కవ్వాల్ అభయారణ్యం, బత్తీస్‌ఘఢ్ కోట, హైదరాబాదులో బిర్లామందిరం, బిర్లా ప్లానెటోరియం, చార్మినార్, గోల్కొండ కోట, నెహ్రూ జూపార్క్, రామోజీ ఫిలిం సిటి, సాలార్జంగ్ మ్యూజియం, చౌమహల్లా ప్యాలెస్, లుంబినీ పార్క్, ఎన్టీయార్ గార్డెన్, సంఘీనగర్ వెంకటేశ్వరాలయం, ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో జగిత్యాల ఖిల్లా, ఎలగందల్ ఖిల్లా, రామగిరిఖిల్లా, ఉమ్మడి ఖమ్మం జిల్లాలో రామాయణం కాలం నాటి పర్ణశాల, పాపికొండలు, కిన్నెరసాని అభయారణ్యం, నేలకొండపల్లి బౌద్ధస్తూపం, ఖమ్మం ఖిల్లా, ఉమ్మడి పాలమూరు జిల్లాలో పిల్లలమర్రి వృక్షం, గద్వాల కోట, ఖిల్లాఘనపురం కోట, అంకాళమ్మ కోట, కోయిలకొండ కోట, పానగల్ కోట, ప్రైయదర్శిని జూరాల ప్రాజెక్టు, వరహాబాదు వ్యూపాయింట్, మల్లెలతీర్థం, ఉమ్మడి నల్గొండ జిల్లాలో నాగార్జునసాగర్ ప్రాజెక్టు, భువనగిరికోట, దేవరకొండ దుర్గం, ఉమ్మడి నిజామాబాదు జిల్లాలో శ్రీరాంసాగర్ ప్రాజెక్టు, అలీసాగర్ ప్రాజెక్టు, దోమకొండ కోట, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో అనంతగిరి కొండలు, కోట్‌పల్లి ప్రాజెక్టు, గండిపేట, శామీర్‌పేట చెరువు, ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఓరుగల్లు కోట, పాకాల చెరువు, ఉమ్మడి మెదక్ జిల్లాలో మెదక్ ఖిల్లా, పోచారం అభయారణ్యం, మంజీరా అభయారణ్యం, కొండాపూర్ మ్యూజియం, తదితర పర్యాటక ప్రాంతాలున్నాయి. ఆర్థిక పరిస్థితి: తలసరి ఆదాయం:తెలంగాణ ప్రాంతపు ప్రజల తలసరి ఆదాయం రూ.36082గా ఉన్నది. జిల్లాల వారీగా చూస్తే హైదరాబాదులో అత్యధికంగా ఉండగా ఉమ్మడి ఆదిలాబాదు, ఉమ్మడి మహబుబ్‌నగర్ జిల్లాల తలసరి ఆదాయం అత్యల్పంగా ఉంది. ఖనిజాలు: తెలంగాణలో అనేక ఖనిజ నిక్షిప్తమై ఉన్నాయి. ఖమ్మం మరియు ఆదిలాబాదు జిల్లాలలో బొగ్గుగనులు, ఆదిలాబాదు మరియు వరంగల్ ప్రాంతాలలో ముడి ఇనుము, ఖమ్మం మరియు మహబూబ్‌నగర్ జిల్లాలలోముగ్గురాయి, రంగారెడ్డి మరియు నల్గొండ జిల్లాలలో సున్నపురాయి నిక్షేపాలు విసృతంగా వ్యాపించియున్నాయి. పరిశ్రమలు: హైదరాబాదు మరియు పరిసరాలలో అన్ని రకాల పరిశ్రమలు ఉన్నాయి. వికారాబాదు జిల్లా తాండూరులో, నల్గొండ జిల్లా మిర్యాలగూడ ప్రాంతంలో సిమెంటు పరిశ్రమలు అధికంగా ఉన్నాయి. రంగారెడ్డి జిల్లా కొత్తూరులో పారిశ్రామికవాడ ఉంది. పటాన్‌చెరు ప్రాంతం పారిశ్రామికంగా అభివృద్ధి చెందింది. సిర్పూర్‌లో కాగితం పరిశ్రమ, కొత్తగూడెంలో థర్మల్ విద్యుత్ కేంద్రం, ఎరువుల పరిశ్రమ ఉన్నాయి. రవాణా సౌకర్యాలు; వాయురవాణా: రంగారెడ్డి జిల్లాలోని శంషాబాదులో రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం ఉంది. ఇక్కడి నుంచి దేశంలోని పలు ప్రాంతాలకు మరియు విదేశాలకు వెళ్ళడానికి సదుపాయం ఉంది. ఈ విమానాశ్రయం అంతర్జాతీయ స్థాయిలో ఉత్తమ విమాశ్రయంగా పలుసార్లు అవార్డులు పొందినది. విమానాశ్రయం ఏర్పాటుకు ముందు బేగంపేటలో డొమెస్టిక్ విమానాశ్రయం ఉండేది. రైలు రవాణా: సికింద్రాబాదు మరియు కాజీపేటలు తెలంగాణలోని ప్రముఖ రైల్వేజంక్షన్లు. ఇవి దక్షిణమధ్యరైల్వేలో రైల్వే డివిజన్ కేంద్రస్థానాలుగా కూడా ఉన్నాయి. హైదరాబాదు/సికింద్రాబాదు నుంచి దేశంలోని అన్ని ప్రధాన ప్రాంతాలకు రైళ్ళు ఉన్నాయి. నిజాంల కాలంలో హైదరాబాదు నుంచి వాడికి రైలుమార్గం వేయబడింది. సికింద్రాబాదు నుంచి విజయవాడకు, సికింద్రాబాదు నుంచి మహబూబ్‌నగర్, కర్నూలు మీదుగా బెంగుళూరుకు, సికింద్రాబాదు నుంచి పర్లి/నాందేడ్‌కు, బీబీనగర్ నుంచి నడికుడికి మార్గాలున్నాయి. గద్వాల నుంచి రాయచూర్ మార్గం పూర్తయింది. ఇవికాకుండా పలు మార్గాలు నిర్మాణంలో ఉన్నాయి. రోడ్డు రవాణా: దేశంలోనే పొడవైన 7వ (కొత్త పేరు 44వ) జాతీయ రహదారి ఉమ్మడి ఆదిలాబాదు, నిజామాబాదు, మెదక్, రంగారెడ్డి, హైదరాబాదు, మహబూబ్‌నగర్ జిల్లాల మీదుగా ఉత్తర-దక్షిణంగా వెళ్ళుచున్నది. పూనా-విజయవాడలను కలిపే 9వ నెంబరు జాతీయ రహదారి తూర్పు-పడమరలుగా ఉమ్మడి మెదక్, రంగారెడ్డి, హైదరాబాదు, నల్గొండ జిల్లాల మీదుగా పోతుంది. నిజామాబాదు నుంచి జగదల్‌పూర్ వెళ్ళే జాతీయ రహదారి ఉమ్మడి నిజామాబాదు, కరీంనగర్, ఆదిలాబాదు జిల్లాల మీదుగా వెళ్ళుచున్నది. హైదరాబాదు నుంచి భూపాలపట్నం వెళ్ళు జాతీయ రహదారి హైదరాబాదు, ఉమ్మడి రంగారెడ్డి, నల్గొండ, వరంగల్ జిల్లాల నుంచి వెళ్తుంది. తెలంగాణ ప్రముఖులు:
ఇవి కూడా చూడండి:
|
3, అక్టోబర్ 2013, గురువారం
తెలంగాణ (Telangana)
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
Index
తెలుగులో విజ్ఞానసర్వస్వము
|
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు, సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, వార్తలు, సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు, |
విభాగాలు: |
------------
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి