జోగులాంబ జిల్లా తెలంగాణ రాష్ట్రంలోని 33 జిల్లాలలో ఒకటి. ఈ జిల్లా అక్టోబరు 11, 2016న కొత్తగా ఏర్పడింది. కృష్ణా-తుంగభద్ర నదుల మధ్యన ఉన్న ఈ జిల్లా పరిపాలన కేంద్రం గద్వాల. 44వ నెంబరు జాతీయ రహదారి, సికింద్రాబాదు-డోన్ మరియు గద్వాల-రాయచూర్ రైలుమార్గాలు జిల్లా గుండా వెళ్ళుచున్నాయి. తెలంగాణలోని ఏకైక శక్తిపీఠం ఆలంపూర్, బీచుపల్లి ఆంజనేయస్వామి దేవాలయం, మల్డకల్ శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయం, జమ్మిచేడ్ జమ్ములమ్మ ఆలయం, ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు, గద్వాల కోట ఈ జిల్లాలోని ముఖ్యమైన పర్యాటక ప్రాంతాలు. కేంద్రసాహిత్య అకాడమి పురస్కార గ్రహీత గడియారం రామకృష్ణశర్మ, రాజకీయనాయకులు పాగపుల్లారెడ్డి, డి.కె.సత్యారెడ్డి, వందేమాతరం రామచంద్రారావు, డి.కె.అరుణ ఈ జిల్లాకు చెందిన ప్రముఖులు.
భౌగోళికం, సరిహద్దులు: జోగులాంబ జిల్లా తెలంగాణలో దక్షిణన తుంగభద్ర నదీ తీరాన ఉంది. ఈ జిల్లాకు దక్షిణాన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, పశ్చిమాన కర్ణాటక రాష్ట్రం, ఉత్తరాన మహబూబ్‌నగర్ జిల్లా మరియు వనపర్తి జిల్లా, ఈశాన్యాన వనపర్తి జిల్లా సరిహద్దులుగా ఉన్నాయి తూర్పున కొనదేలియున్న ప్రాంతానికి ఆంధ్రప్రదేశ్ సరిహద్దుగా ఉంది. దక్షిణ సరిహద్దు గుండా తుంగభద్రనది, ఈశాన్య సరిహద్దున కృష్ణానది ప్రవహిస్తున్నాయి. మండలాలు: గద్వాల, కేటీ దొడ్డి, ధరూర్, గట్టు, మల్డకల్, ఆలంపుర్, మానోపాడ్, ఇటిక్యాల, వడ్డేపల్లి, అయిజ, రాజోళి, ఉండవెల్లి.
పర్యాటక ప్రాంతాలు: తెలంగాణలో ఏకైక శక్రిపీఠం ఆలంపూర్ తుంగభద్ర నది ఒడ్డున ఉంది. ఉత్తరసరిహద్దులో కృష్ణానదిపై ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు నిర్మించబడింది. తెలంగాణలో ప్రముఖమైన స్వయంభూ వేంకటేశ్వరస్వామి ఆలయం మల్డకల్‌లో ఉంది. జిల్లాకేంద్రంలో సంస్థానాధీశులు నిర్మించిన గద్వాలకోట, చెన్నకేశవస్వామి ఆలయం ఉన్నాయి. కృష్ణానదిపై జాతీయరహదారి సమీపంలో బీచుపల్లి ఆంజనేయస్వామి ఆలయం ఉంది. రవాణా సౌకర్యాలు: దేశంలోనే అతిపొడవైన జాతీయ రహదారి సంఖ్య 44 జిల్లా గుండా వెళ్ళుచున్నది. ఆలంపూర్ చౌరస్తా మరియు ఎరవల్లి చౌరస్తా ఈ NHపై ఉన్న ముఖ్య కూడళ్ళు. గద్వాల నుంచి ప్రముఖ పట్టణాలకు రోడ్డుమార్గాలున్నాయి. సికింద్రాబాదు-డోన్ రైలుమార్గం జిల్లా గుండా గద్వాల, ఇటిక్యాల, మానోపాడ్‌ల మీదుగా వెళ్ళుచుండగా గద్వాల నుంచి రాయచూర్ వరకు మరోమార్గం ఉంది. రాజకీయాలు: జిల్లాలో 2 అసెంబ్లీ నియోజకవర్గాలు (గద్వాల మరియు ఆలంపూర్) ఉన్నాయి. ఇవి నాగర్‌కర్నూల్ లోకసభ నియోజకవర్గంలో భాగము. ఇవి కూడా చూడండి:
= = = = =
|
Tags:Jogulamba Dist in Telugu, Jogulamba District essay in Telugu, Jogulamba District information in Telugu, Jogulamba Jilla Samacharam in Telugu, Gadwal Dist in Telugu,
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి